
సాక్షి, అమరావతి: అనుకున్నట్టుగానే నకిలీ మద్యం మాఫియా దందాను గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. ఈ దందాను అద్దేపల్లి జనార్దన్ వరకే పరిమితం చేసి, దర్యాప్తును పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, ‘నకిలీ మద్యం దందా వెనుక సూత్రధారుల గుట్టు రట్టు చేస్తాం’ అన్న ములకలచెరువు గ్యాంగ్ బెదిరింపులకు ముఖ్యనేత భయపడ్డారన్నది తేటతెల్లమవుతోంది. నకిలీ మద్యం దందా అంతా ఒక్క జనార్దన్ మాత్రమే చేసినట్టుగా తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి, అలాగే కీలక నాయకుడు సురేంద్రనాయుడుతో తనకు లిక్కర్ వ్యాపార సంబంధాలు ఉన్నాయని జనార్దన్ తెలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు, అసలు వీరికి ఈ దందాలో భాగం ఉన్నట్లు అర్థం వచ్చేలా అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. జయచంద్రారెడ్డి పేరు నిందితునిగా చేరిస్తే, ఆయన వెనుక ఉన్న ముఖ్యనేత పేర్లు బయటకు వస్తాయని, ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ నేతల పేర్లు బట్టబయలవుతాయన్న భయంతో ఈ ఎత్తుగడ వేశారు. మద్యం దుకాణాల వ్యాపారంలో లాభాలు రావడం లేదని 2025 జూన్ తర్వాత జనార్దన్‌తో టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు చేతులు కలిపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం ఏమిటంటే.. ఈ మాఫియాకు మూలం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు.
జనార్దన్ వారి అనుచరుడు మాత్రమే. 2024 ఎన్నికలకు ముందే నకిలీ మద్యం దందా కోసం ముఖ్యనేతతో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు డీల్ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టిక్కెట్ కేటాయించారు. ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌ను మాత్రమే నకిలీ మద్యం నిర్వాహకునిగా పేర్కొనడం ముఖ్యనేత కుట్రకు నిదర్శనం.
తద్వారా మాఫియాకు మూలమైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడులను పూర్తిగా తప్పించాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. పైగా అద్దేపల్లి ఈ ఏడాది జూన్‌లోనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్టు సూచించడం విడ్డూరం. మొత్తంగా నకిలీ మద్యం దందా తీవ్రతను తగ్గించి అంతిమ లబ్ధిదారులకు కొమ్ముకాయడమే రిమాండ్ రిపోర్ట్ లక్ష్యమని అర్థమవుతోంది.