టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం

Published Tue, Nov 3 2020 3:16 AM

Vehicle of smugglers that collided with the Tipper - Sakshi

వల్లూరు (వైఎస్సార్‌ జిల్లా): వైఎస్సార్‌ జిల్లా కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండల పరిధిలోని గోటూరు, తోల్లగంగనపల్లె బస్‌స్టాప్‌ల మధ్య సోమవారం వేకువజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరను అన్‌లోడ్‌ చేసిన టిప్పర్‌ వేకువజామున 3.15 గంటల సమయంలో కడప వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారిపైకి ఎక్కుతుండగా అనంతపురం వైపు ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో కారు సైతం వీటిని ఢీకొంది. దీంతో టిప్పర్‌ డీజిల్‌ ట్యాంక్‌ ధ్వంసమై మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో స్కార్పియో వాహనంలోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాకు చెందిన కూలీల్లో నలుగురు సజీవ దహనం కాగా.. అందులో ఉన్న ఎర్ర చందనం దుంగలు కాలిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మూర్తి అనే మరో కూలీ మృతి చెందాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి సజీవ దహనమైన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన రాజన్, సందిరన్, రామచంద్రన్‌గా తెలుస్తోంది. మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో టిప్పర్, స్కార్పియోతో పాటు మరో కారు కూడా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌ కిందకు దూకి అపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన మరో కారు ఎవరిది, అందులో ప్రయాణిస్తున్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. 

ప్రమాదంతో వెలుగులోకొచ్చిన స్మగ్లింగ్‌
అరుదైన ఎర్ర చందనం చెట్లు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్ల పరిధిలో దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 13 చెక్‌ పోస్టులు నడుస్తున్నాయి. గతంలో కడప డివిజన్‌లోని సిద్ధవటం, రాయచోటి, వేంపల్లె, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్ర చందనం ఎక్కువగా స్మగ్లింగ్‌ అయ్యేది. ఆ తరువాత సద్దుమణిగినా.. ఈ ఘటనతో స్మగ్లర్ల ఉనికి మరోసారి వెలుగులోకి వచ్చింది. 

Advertisement
 
Advertisement