మరో 23 జీవులు అంతరించిపోయాయి

US Declare 23 Species, Including Ivory Billed Woodpecker - Sakshi

అధికారికంగా ప్రకటించిన అమెరికా

మనుషుల విధ్వంసక చర్యల కారణంగా ఎన్నో జీవులు అంతరించి పోతున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా మరో 23 జీవులు చేరాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత డిసెంబర్‌ 29న తుది ప్రకటన చేయనుంది. అంతరించిపోయిన జాబితాలో పండ్లను తిని జీవించే ఓ రకం గబ్బిలం, పదకొండు రకాల పక్షులు, మంచినీటి ఆల్చిప్పలు, రెండు రకాల చేపలు, పుదీనా జాతికి చెందిన ఓ మొక్క ఉన్నాయని అమెరికా ఇంటీరియర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఇన్ని జీవులను ఒకేసారి అంతరించిపోయిన జాబితాలో ప్రకటించడం ఇదే మొదటిసారి అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

మనుషులు సృష్టిస్తున్న కాలుష్యం మూలంగా ఏర్పడిన పర్యావరణ మార్పులు, ఆవాసాల ధ్వంసం కారణంగా ఆ జీవులు మనుగడ కోల్పోవడం వంటి కారణాలతో ఆ జీవులు ఇక కనపడకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల చర్యలు మరిన్ని జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని, వన్యజీవులను కాపాడటానికి మరింత ఉత్సాహంగా, కలసికట్టుగా పనిచేయాలని అమెరికా ఇంటీరియర్‌ సెక్రటరీ డెబ్‌ హాలాండ్‌ అభిప్రాయపడ్డారు. 1970 నుంచి చూస్తే ఉత్తర అమెరికాలోని పక్షుల సంఖ్య 3 బిలియన్ల మేర తగ్గిపోయిందని తెలిపారు.   

చట్టంతో కాస్త మెరుగు..
అమెరికా అంతరించిపోతున్న జీవుల చట్టం (ఈఎస్‌ఏ) తీసుకొచ్చిన తర్వాత ఇతర జీవుల మనుగడలో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రక్షించాల్సిన జాబితాలో ఉన్న 54 జీవుల సంతతి సమృద్ధిగా ఉండటంతో వాటిని ఆ జాబితా నుంచి ఇటీవల తొలగించారు. వాటిలో అమెరికన్‌ పెరిగ్రిన్‌ ఫాల్కన్, బాల్డ్‌ ఈగిల్‌ ఉన్నాయి. మరో 56 జీవులను అంతరించిపోతున్న జాబితా నుంచి ‘ప్రమాదకర’ జాబితాకు తగ్గించారు. అమెరికా వ్యాప్తంగా  ఈ జాబితాల్లో ప్రస్తుతం 1,600లకు పైగా జీవులు ఉన్నాయి.

ఇక కానరాని.. దేవుడు పక్షి
అంతరించిన పోయిన జాబితాలో ఉన్న పక్షుల్లో ఐవరీ బిల్ల్‌డ్‌ వడ్రంగి పిట్ట, వీనుల విందైన గొంతు కలిగిన ఓ రకం పిచ్చుక ఉన్నాయి. వడ్రంగి పిట్టను అమెరికా ప్రజలు దేవుడు పక్షిగా పిలుచుకునేవారు. ఆదేశంలోని వడ్రంగి పిట్ట జాతుల్లో ఇది పెద్దది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని భారీ వృక్షాలు వీటి ఆవాసం. కలప కోసం, ఇతర అవసరాల కోసం ఆ వృక్షాలను నరికివేయడంతో వడ్రంగి పిట్టలు ఆవాసాలను కోల్పోయాయి. 1944 ప్రాంతంలో ఈశాన్య లూసియానా ప్రాంతంలో చివరిసారిగా ఇది కనిపించింది. ఇక శ్రావ్యమైన గొంతు కలిగిన పక్షుల్లో ఒకటిగా, అత్యంత అరుదైన దానిగా పేరుగాంచిన బాచ్‌మన్స్‌ వార్‌బ్లెర్‌ పిచ్చుక అమెరికాలో 1962లో చివరిసారిగా కనిపించింది. ఈ వలస పిచ్చుక 1981లో క్యూబాలో చివరిసారిగా కనిపించిన తర్వాత మళ్లీ దాని జాడ లేకుండా పోయింది. ఈ రెండింటిని 1967లో తొలిసారిగా అంతరించిపోయే జాబితాలో చేర్చగా.. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయిన వాటిగా ప్రకటించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top