ఇక ఎంసీఏ రెండేళ్లే

University Grants Commission Started Some New Degree Courses - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రోగ్రామ్‌ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని  www.ugc.ac.in లో పొందుపరిచింది.  

ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం.. 
ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, డిజైన్‌ విభాగాల్లో తొమ్మిది కొత్త కోర్సులను యూజీసీ ప్రకటించింది. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణుల కోసం బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ అర్బన్‌ డిజైన్‌ (వ్యవధి: నాలుగేళ్లు), బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌ (వ్యవధి: మూడేళ్లు) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్, అర్బన్‌ డిజైన్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ సైన్స్‌లో రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా ప్రకటించింది. ఈ కోర్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలనేదాన్ని యూనివర్సిటీల ఇష్టానికి వదిలేసింది.   

కొత్త మార్పులు ఇలా.. 
యూజీసీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. అలాగే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ) కోర్సు వ్యవధిని నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. 12వ తరగతి ఉత్తీర్ణులై వైద్య రంగంలోకి రావాలనుకునే విద్యార్థుల కోసం కొత్తగా బ్యాచిలర్‌ ఆఫ్‌ సోవా రిగ్పా మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీఎస్‌ఆర్‌ఎంఎస్‌) కోర్సును యూజీసీ ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు కాలవ్యవధి.. ఐదున్నరేళ్లు. మెడిసిన్, సర్జరీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, హెల్త్‌ అనుబంధ సైన్సెస్, ఫార్మసీ, పారామెడికల్, నర్సింగ్‌ తదితర విభాగాల్లో ఈ బీఎస్‌ఆర్‌ఎంఎస్‌ కోర్సును అందిస్తారు.

(చదవండి: ఏపీ పథకాలు బాగున్నాయ్‌..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top