బీటెక్‌ విద్యార్థినితో గణేష్‌ ప్రేమవివాహం.. గగన శ్రీ మృతితో..

Unable to bear wife Death, Husband dies by Suicide in Kalyandurg - Sakshi

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య 

రెండు రోజుల వ్యవధిలో ఘటన

నాది కాని జీవితానికి నన్ను బానిసను చేశావు నన్ను నన్నుగా మెచ్చి నాలో ఆశలు రేపావు నా నవ్వులో దాగిన నువ్వు.. నన్ను నలుగురిని కలిపింది నువ్వున్నావన్న నమ్మకమే.. నన్ను నన్నుగా నిలిపింది నీవు లేని జీవితం వ్యర్థమని.. నిన్ను విడిచి వెళ్లనని అంతులేని కలగా మిగిలిపోయావు నువ్వు లేని ఈ బతుకు వ్యర్థం... అందుకే నేనూ వస్తున్నా... అంటూ భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం సాయంత్రం కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది.  

కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): స్థానిక శంకరప్ప తోటకు చెందిన నాగరాజు, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గణేష్‌ (23) బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బేల్దారి పని కోసం కర్ణాటకలోని వైఎన్‌హెచ్‌ కోటకు వెళ్లాడు. ఆ సమయంలో గగనశ్రీ (24)తో అతనికి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం గగనశ్రీని తల్లిదండ్రులు మంగళూరులోని ఏజే ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ కోర్సులో చేర్పించారు. విషయం తెలుసుకున్న గణేష్‌ కూడా మంగళూరుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం అక్కడే కాపురమున్నారు. పెద్దలకు తెలియకుండా గగనశ్రీ బీటెక్‌ ద్వితీయ సంవత్సరం మధ్యలో ఆపేసి ఐదు నెలల క్రితం భర్తతో కలసి కళ్యాణదుర్గానికి వచ్చేసింది.  

జ్వరం బారిన పడి...  
ఇటీవల గగనశ్రీ జ్వరం బారిన పడింది. స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో చేర్పించారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి. జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షించిన వైద్యులు ఆమె డెంగీతో బాధపడుతున్నట్లు ఈ నెల 6న గుర్తించారు. విషయాన్ని గణేష్‌కు తెలపడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గణేష్‌ కుటుంబసభ్యులే తమ కుమార్తెను చంపేశారంటూ గగనశ్రీ తల్లిదండ్రులు నాగరాజు, హనుమక్క కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్‌..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?')

ట్రూ లవ్‌ నెవర్‌ ఎండ్స్‌ 
నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు అనే నానుడిని గణేష్‌ నిజం చేశాడు. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిదన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతను గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులతో ఆస్పత్రి ఆవరణం కిక్కిరిసింది. రోదనలు మిన్నంటాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరినీ తీసుకెళ్లావా.. దేవుడా ఎంత పని చేశావంటూ రోదిస్తుండడం అందరినీ కలిచివేసింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top