అయ్యన్న ఇంటి ముట్టడికి యత్నం

Uma Shankar Ganesh Attempt to invade Ayyannapatrudu for his comments - Sakshi

ఎమ్మెల్యే గణేష్‌ను అడ్డుకున్న పోలీసులు

నర్సీపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి శనివారం అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ నిర్వహించవద్దని టౌన్‌ సీఐ స్వామినాయుడు ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. అరెస్ట్‌ చేసుకుంటే చేసుకోండి. అతడి ఇంటిని ముట్టడించి తీరుతామని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ముందుకు సాగడంతో ఐదు రోడ్ల కూడలి సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, పార్టీ నాయకులు మెయిన్‌ రోడ్డుపై బైఠాయించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని సీఐలు ఎమ్మెల్యేకు నచ్చచెప్పడంతో అక్కడ నుండి ఎమ్మెల్యే టౌన్‌ స్టేషన్‌కు చేరుకుని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనికి ముందు అబిద్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి మద్యం సీసాల దండలు మెడలో వేసి అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు దిష్టి బొమ్మలను దహనం చేశారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుని అరెస్ట్‌ చేయాలని నినాదాలు చేశారు.

గొలుగొండ మండలంలో అయ్యన్న బినామీల పేరుతో వందల ఎకరాలు సంపాదించారని, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి సన్‌ రిసార్ట్స్, లిక్కర్‌ ఫ్యాక్టరీ  వంటి కంపెనీలు ఎలా పెట్టారని అయ్యన్నపాత్రుడిని ఎమ్మెల్యే గణేష్‌ ప్రశ్నించారు. లేటరైట్‌ అక్రమ తవ్వకాలతో అయ్యన్నపాత్రుడు రూ.100 కోట్లు దోచుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top