విధి ఆట.. గెలుపు బాట

Two Girls Are Excelling In Sports In Nellore District - Sakshi

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తల్లిదండ్రులు 

చిన్నారులకు కోచ్, దాతల అండ  ఫుట్‌బాల్లో రాణిస్తున్న అక్క

బాలసదన్‌ నుంచి స్పోర్ట్స్‌ స్కూల్‌కు చేరిన వైనం 

స్కూల్‌ గేమ్స్‌లో చెల్లెలి ప్రతిభ  

ఆ ఇద్దరు బాలికలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. సొంతవారు అండగా నిలవలేదు. బాలసదన్‌లో ఆశ్రయం పొందారు. ఆ చిన్నారుల జీవితాల్లో క్రీడలు వెలుగులు నింపాయి. భవిష్యత్‌ జీవితానికి బంగారు బాటలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐసీడీఎస్, కోచ్‌లు, అందించిన సహకారంతో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఈనెల 29వ తేదీన నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.  
సాక్షి,నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వెంకటాచలం మండలంలోని మనుబోలు గ్రామంలో రమేష్‌, అంజమ్మ దంపతులు జీవించేవారు. వీరికి శృతి, పల్లవి పిల్లలు. ఏరోజు కారోజు కూలీ పనులు చేస్తే తప్ప గడవని జీవితాలు వాళ్లవి. ఈ నేపథ్యంలో 2013 సంవత్సరంలో రమేష్‌, అంజమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమ్మానాన్న చనిపోవడంతో శ్రుతి, పల్లవి అనాథలయ్యారు. కొందరు వారిని నెల్లూరులో ఐసీడీఎస్‌ బాలసదన్‌లో చేర్చారు. అక్కాచెల్లెళ్లు అప్పటి నుంచి అక్కడే ఉంటూ చదువులు ప్రారంభించారు. 


స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రవేశం 
చదువుకుంటూ క్రీడల్లో రాణించాలంటే స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఉపయోగపడతాయని కోచ్‌ సుకుమార్‌ 2017లో ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌ సెలక్షన్స్‌కు శృతిని పంపారు. రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించిన చిన్నారి కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో చేరింది. రెండేళ్ల శిక్షణ అనంతరం అక్కడి కోచ్‌లు ఫుట్‌బాల్‌ క్రీడకు శృతి బాగా సరిపోతుందని గుర్తించారు. బాలికలకు ఫుట్‌బాల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం శృతి అక్కడ 8వ తరగతి చదువుతోంది. చెల్లెలు పల్లవి స్కూల్లో గేమ్స్‌లో రాణిస్తోంది. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాళెం కస్తూర్బా బాలికల విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. ఊహతెలియని వయసులోనే సర్వం కోల్పోయినా మనోధైర్యంతో అటు క్రీడల్లో, ఇటు చదువుల్లో అక్కాచెల్లెళ్లు రాణిస్తున్నారు. 

కోచ్‌ గుర్తించడంతో..  
కొంతకాలానికి అక్కాచెల్లెళ్లు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌కు హాజరయ్యారు. బాలికల్లో చురుకుదనాన్ని ఖోఖో కోచ్‌ సుకుమార్‌ గుర్తించారు. వారి పరిస్థితులను ఆరాతీశారు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌కు రావడం, బాలికల్లోని ఆసక్తిని గమనించిన కోచ్‌ వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. బాలభవన్‌ అధికారులతో సంప్రదించి క్రీడల్లో రాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో శృతి స్కూల్‌ స్థాయి, జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో రాణించడం మొదలుపెట్టింది. కోచ్‌ సుకుమార్‌ ఆమెకు క్రీడా దుస్తులు, పరికరాలు, పుస్తకాల కోసం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చారు. ఖోఖో అసోసియేషన్‌ నాయకులు కె.గురుప్రసాద్, విజయకుమార్, గిరిప్రసాద్‌ తదితరులు శృతికి సాయం చేశారు. 

భారత జట్టులో స్థానం సాధిస్తా 
గురువులు ఇచ్చిన సహకారంతో క్రీడల్లో మెళకువలు నేర్చుకుంటున్నా. దేశం తరఫున ఆడాలని ఉంది. పెద్దలు సహాయం చేస్తున్నారు. మంచి ఉద్యోగం సాధించి నాలాంటి పదిమందికి అండగా నిలుస్తాను. డీఎస్‌ఏ, ఐసీడీఎస్‌ అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ మరువలేనిది. 
- శృతి, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి 
ప్రతిభను గుర్తించడం వల్లే.. 
సమ్మర్‌ క్యాంప్‌లో పాల్గొన్నప్పుడే శృతి, పల్లవిలోని ప్రతిభను గుర్తించాం. తల్లిదండ్రుల్లేని పిల్లలు కావడంతో చాలామంది సహాయం చేశారు. ఇప్పటికీ బాలసదన్‌ అధికారులు చూపిస్తున్న ఆదరాభిమానాలు గొప్పవి. దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా వీరు తయారవుతారు.
– సుకుమార్, ఖోఖో కోచ్‌

చదవండి: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top