
తాడేపల్లి కళ్లం అంజిరెడ్డి పాఠశాలలో పిల్లల ముందు ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్‌ఎం అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకులను స్కూల్‌కు పిలిపించి సభ నిర్వహించడం చర్చకు దారితీసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు టీడీపీ నాయకులు ర్యాలీగా రావడంతో తాడేపల్లి కళ్లం అంజిరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల హెచ్‌ఎం రాయల సుబ్బారావు.. వారికి ఫోన్ చేసి మరీ పాఠశాలకు పిలిపించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అసెంబ్లీని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులతో ప్రసంగాలు చెప్పించారు. తమ పార్టీ నాయకులు, తమ పార్టీ గొప్పతనం అంటూ వారు పిల్లల ముందు ఊదరగొట్టారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరగా స్కూల్లో సభలు, సమావేశాలేవీ ఏర్పాటు చేయలేదని చెప్పారు. అసెంబ్లీ ఏర్పాటుచేసి మీటింగ్ పెట్టించారట కదా అని ప్రశ్నిస్తే.. అదేం లేదంటూ మాట దాటవేశారు.