
సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన హెరిటేజ్ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్ ఆరోపించాడు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ ఏడాది ఫిబ్రవరి నెల 23న అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా కర్నూలు–వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారుని హెరిటేజ్ కంటైనర్ ఢీ కొందని తెలిపాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని ఆరోజు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదని బాలునాయక్ వివరించాడు.
న్యాయం చేయమని వెళితే గెంటేశారు..
‘వైఎస్సార్ కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను కలిశా. విషయం చెప్పాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా హెరిటేజ్ యాజమాన్యం న్యాయం చేయలేదు. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేశ్ చాంబర్ కి వెళ్లి మరోసారి విన్నవించా. అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ, హెరిటేజ్ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబసభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలం, ట్రాక్టర్ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని బాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్ యాజమాన్యం, టీడీపీ న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు.