
ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న ఏవో మంజుల
నిమ్మనపల్లెలో ఎరువుల దుకాణ యజమాని కండిషన్
ప్రభుత్వ నిర్ణిత ధరల కంటే రూ.80 అదనంగా వసూలు
రైతుల ఫిర్యాదుతో ఏవో ఆకస్మిక తనిఖీ
8.4 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్
నిమ్మనపల్లె: యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్జనకు తెరలేపాడో ఎరువుల దుకాణ యజమాని. యూరియా కావాలంటే ఎరువులు, లేదా పురుగుమందు కొనుగోలు చేయాలని కండిషన్ పెట్టాడు. పైపెచ్చు ఒక్కో యూరియా కట్టకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా రూ.80 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తూ రైతులను మోసగించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణంలో యూరియా కొనుగోలుకు పెద్దసంఖ్యలో రైతులు బారులు దీరారు.
ఇతర దుకాణాల్లో యూరియా లేకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో దుకాణ యజమాని అధిక ధరలకు విక్రయించసాగాడు. దీంతో ఆగ్రహించిన రైతులు సమస్యను స్థానిక మీడియా దృష్టికి తీసుకురాగా, దుకాణ యజమానిని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో వారు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏవో మంజుల, బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని తనిఖీ చేశారు. చల్లావారిపల్లెకు చెందిన రైతు ఆదినారాయణ యూరియా కోసం రూ.850 విలువైన గడ్డిమందును అవసరం లేకున్నా కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
మరో రైతు ఈశ్వరయ్య రెండు బస్తాల యూరియా కోసం రూ.1,600 విలువచేసే సీఎన్‌ఎస్ కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేశానన్నారు. ఏవో తనిఖీల్లో యూరియా అధిక ధరలకు విక్రయించడం, పురుగుమందు కొంటేనే ఇస్తానని చెప్పడం రైతుల విచారణలో నిర్ధారణ అయ్యింది. అలాగే అమ్మిన యూరియాకు సంబంధించి బిల్లు ఇవ్వలేదని రైతులు ఫిర్యాదుచేశారు.
దీంతో ఏవో మంజుల బాలాజీ ఫెర్టిలైజర్స్ దుకాణంలో ఉన్న 250 బస్తాల యూరియాను దగ్గరుండి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంపిణీ చేయించారు. దుకాణంలో నిల్వ ఉన్న 8.4 మెట్రిక్ టన్నుల ఐదురకాల ఎరువులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడిన దుకాణ యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.