
ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ‘సూపర్ స్క్రిప్ట్’
మహానాడు వేదికగా తెరపైకి రానున్న సూపర్ సిక్స్ విధానాలు!
ఏడాదైనా ఏమీ చేయకపోవడంపై ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ
ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు బుట్ట దాఖలు
అందులో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం
హంగు, ఆర్భాటం, మోసపు మాటలే పెట్టుబడిగా ముందుకు..
కడప మహానాడులో ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: కడప మహానాడు వేదికగా మరో కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతు న్నారు. 2023లో రాజమండ్రి మహానాడులో ప్రజలను మోసం చేసే మహా ప్రణాళికను ప్రకటించారు. ఇప్పుడు కడప మహానాడులోనూ అదే తరహాలో మరో కొత్త ప్రణాళిక విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి తన కుమారుడు లోకేశ్‌ను అందలం ఎక్కించే వేదికగా మహానాడును ఉపయోగించుకోవడానికి పకడ్బందీ వ్యూహ రచన చేశారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహాలో తన కుమారుడి ద్వారా సూపర్ సిక్స్ విధానాలంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు కొత్త పల్లవిని వల్లె వేయించనున్నట్లు తెలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన, స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, అన్నదాతకు అండ, ఉన్నత స్థాయికి తెలుగు యువత, తెలుగు జాతి ఖ్యాతి’ పేర్లతో వాటిని రూపొందించినట్లు తెలిసింది. ఈ ఆరు విధానాలను పార్టీ కార్యకర్తల కోసం అమలు చేస్తామని మహానాడు వేదికపై ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మళ్లీ ‘సూపర్’ మోసం
2023లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల తరహాలోనే మహానాడులో సూపర్ సిక్స్ విధానాల పేరుతో మాయ చేసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు పేర్లతో వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇప్పుడు కొత్తగా సూపర్ సిక్స్ విధానాలంటే ఎవరు నమ్ముతారని టీడీపీ నేతకులే వ్యాఖ్యానిస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాలైన మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్..లలో ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. మహిళలకు ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం పేరుతో బడికెళ్లే పిల్లలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలంటూ చెప్పినా దేన్నీ ఇవ్వలేదు. రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆరి్థక సాయం చేస్తామని పట్టించుకోలేదు. నిరుద్యోగులకు రూ.20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇవేమీ అమలు కాలేదు.
ప్రజల్లో ఆగ్రహం.. అందుకే ఆర్భాటం
» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క సంక్షేమ పథకం అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో వాళ్లను ఏదో ఒక రకంగా మాయ చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో చేసేసినట్లు, ఏడాదిలో అనేక విజయాలు నమోదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
» ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ సిక్స్ విధానాలను తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డబ్బులు లేవని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఏమీ ఇవ్వలేననే విషయాన్ని చంద్రబాబు నెమ్మదిగా చెప్పారు. బయట నుంచి చూసి అన్నీ చేయగలననుకుని హామీలు ఇచ్చానని, ఇప్పుడు ఎలా చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు.
» దీన్నిబట్టి హామీలపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మహానాడులో తమ వైఫల్యాలు, హామీల అమలు ఊసే లేకుండా మాయ చేసేందుకు టీడీపీ పరివారం నిమగ్నమైంది. ఎల్లలు లేని ప్రచారం, సోషల్ మీడియాలో బజ్ సృష్టించి లబ్ధి పొందడంపైనే దృష్టి కేంద్రీకరించారు.
» వైఎస్ జగన్ ఇస్తున్న పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి.. ఆచరణలో ఏమీ చేయక పోవడంతో తాము చంద్రబాబు చేతిలో మరోమారు మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ మోసాలకు ఎల్లో మీడియా వంత పాడుతుంటే కనుక్కోలేని వెర్రి వాళ్లమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికే మరోసారి మాయా వేదిక సిద్ధమైంది.