ఒక్క ఓటుతో సర్పంచ్‌ పదవి

Sarpanch position with one vote - Sakshi

కందలంపాడులో ఇదీ సంగతి

దిబ్బపాలెంలోనూ అంతే..

లాటరీతో వరించిన పదవి

సాక్షి, అమరావతి బ్యూరో: అది కృష్ణా జిల్లాలోనే బుల్లి పంచాయతీ.. 1975లో కుందేరు నుంచి వేరుపడి పంచాయతీగా ఏర్పాటైంది. 350 మంది జనాభా, 232 మంది ఓటర్లున్న ఆ ఊరి పేరు కందలంపాడు. కంకిపాడు మండలంలో ఉంది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు గతంలో నిర్మల్‌ గ్రామ పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.. ఈ పంచాయతీ జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అవడంతో ఇద్దరు బరిలో నిలిచారు. మంగళవారం నాటి ఓటింగ్‌లో 232 ఓట్లకు గాను 211 పోలయ్యాయి. ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇందులో బాయిరెడ్డి నాగరాజు (వైఎస్సార్‌సీపీ మద్దతుదారు)కు 103, మొవ్వ శివనాగ సుబ్రహ్మణ్యానికి 102 ఓట్లు వచ్చాయి. దీంతో ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో నాగరాజు సర్పంచ్‌ అయ్యారు. ఇక ఆ ఊరిలోని నాలుగు వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగిలిన మూడు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులే గెలుపొందారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నవీన్‌కు ఉప సర్పంచ్‌ పదవిని కట్టబెట్టారు. 

దిబ్బపాలెంలోనూ అంతే..
మాడుగుల రూరల్‌: విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దిబ్బపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేశారు. గ్రామానికి చెందిన నందారపు కాసులమ్మ, తుంపాల నిరంజని పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నిరంజని కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాసులమ్మకు 742 ఓట్లు రాగా, తుంపాల నిరంజనికి 743 ఓట్లు వచ్చాయి. 

కాపవరం పంచాయతీలోనూ..
సామర్లకోట: ఒక్క ఓటు.. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఆయనను విజయం వరించింది. తూర్పుగోదావరి జిల్లా కాపవరం పంచాయతీలో 8 వార్డులున్నాయి. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో కుంచం మాధవరావు గెలుపొందారు. అధికారులు తిరిగి ఓట్లు లెక్కించడంతో అదే ఒక్క ఓటు తేడాతో మాధవరావు గెలుపొందారు. 

లాటరీతో వరించిన పదవి
గోనేడ సర్పంచ్‌గా గంగరాజు
ప్రత్తిపాడు : ఇద్దరు అభ్యర్థులకూ ఓట్లు సమంగా వచ్చాయి.. దీంతో అధికారులు లాటరీ తీసి అభ్యర్థిని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ పంచాయతీ సర్పంచ్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో అల్లు విజయకుమార్, పలివెల గంగరాజులకు 1,207 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ తీయగా విజయ్‌కుమార్‌ను అదృష్టం వరించడంతో సర్పంచ్‌ అయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top