‘కోల్‌’కుంటున్న విద్యుత్‌ కేంద్రాలు 

Rising coal reserves Power stations - Sakshi

దేశంలోని 92 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో క్రమంగా పెరుగుతున్న బొగ్గు నిల్వలు 

వారం రోజుల్లో తెరుచుకున్న 3 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు 

రాష్ట్రంలో బొగ్గు కొరతను విజయవంతంగా అధిగమించిన ఇంధన శాఖ 

సాక్షి, అమరావతి: బొగ్గు సంక్షోభం నుంచి దేశంలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు మెల్లగా కోలుకుంటున్నాయి. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వారం రోజులుగా దేశవ్యాప్తంగా మూడు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తెరుచుకోవడంతో పాటు కొరత ఎదుర్కొంటున్న కేంద్రాల సంఖ్య తగ్గడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. దేశంలోని 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి బొగ్గు కొరత తీవ్రమైంది. ఈ నెల 12 నాటికి 116 కేంద్రాల్లో బొగ్గు నిల్వల సమస్య తలెత్తింది. 18 కేంద్రాలు మూతపడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరికంటే ముందుగా స్పందించి బొగ్గు కొరత నివారణకు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో భాగంగానే కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) విద్యుత్‌ సంస్థలకు మినహా ఇతర అవసరాలకు బొగ్గు సరఫరా నిలిపివేసింది. ఫలితంగా బొగ్గు నిల్వల్లో పురోగతి మొదలైంది. సీఈఏ మంగళవారం నాటి నివేదిక ప్రకారం.. మూతపడ్డ కేంద్రాల్లో వారం రోజుల్లో మూడు కేంద్రాలు ఉత్పత్తి ప్రారంభించాయి. 15 కేంద్రాలు ఇంకా మూతపడే ఉన్నాయి. 22 కేంద్రాల్లో ఒక రోజుకు, 19 కేంద్రాల్లో రెండు రోజులకు, 18 కేంద్రాల్లో మూడు రోజులకు, 15 కేంద్రాల్లో నాలుగు రోజులకు, 10 కేంద్రాల్లో ఐదు రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తంగా 1,30,184 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే 107 కేంద్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మూతబడ్డ 135 కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే 1,65,066 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.   

రాష్ట్రంలో సాధారణ స్థాయికి.. 
రాష్ట్రంలో బొగ్గు నిల్వలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ఉన్న 48,100 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నాలుగు రోజులకు సరిపోతుంది. డాక్టర్‌ నార్ల తాతారావు కేంద్రంలో ఉన్న 27 వేల మెట్రిక్‌ టన్నులు ఒక రోజుకు, రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ఉన్న 58,800 మెట్రిక్‌ టన్నులు మూడు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు వివిధ మార్గాల ద్వారా గతంలో ప్రతిరోజూ వచ్చినట్టుగానే 14 ర్యాకుల బొగ్గు ప్రస్తుతం వస్తోంది. 

బొగ్గు కొరతను అధిగమించాం 
బొగ్గు కొరతను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు విజయవంతంగా అధిగమించిందని, రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తోందని ఇంధన శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్‌ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. అనేక రాష్ట్రాలు బొగ్గు కొరతతో బాధపడుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడానికి చేసిన ప్రయత్నాలతో వినియోగదారులు సంతృప్తి చెందారని పేర్కొంది. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి స్వల్పకాలిక టెండర్లను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top