
రాష్ట్రపతి, సీజేఐకు విశ్రాంత ఉద్యోగి వినతి
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా
ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నేను ఏ తప్పూ చేయకపోయినా సస్పెండ్ చేశారు. చేయని తప్పునకు 12 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నా. నాపై మోపిన అభియోగం రుజువు కాలేదు. అయినా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం వేధిస్తోంది. నేను బతికి ఉండగా పెన్షన్ వస్తుందో, రాదో? ఇక ఈ బాధలు పడలేను. బలవన్మరణానికి అనుమతివ్వండి’ అంటూ ఓ విశ్రాంత ఉద్యోగి.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విజయవాడలో మీడియాకు వివరించారు.
2023లో ఉద్యోగ విరమణ..
కాకినాడ జిల్లా కందరాడకు చెందిన పి.వి.వి.ఎస్.ఎస్.మూర్తి 2007 నుంచి 2011 వరకు ఆ గ్రామ వీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2023 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేశారు. కాగా, 2011లో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీలో మూర్తి అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్‌కు తహసీల్దార్ నివేదిక పంపారు. ఎలాంటి విచారణ చేపట్ట కుండా 2013లో మూర్తిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మూర్తి అనేకసార్లు అప్పటి, ఆ తర్వాతి ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసుకున్నారు.
నిరాధారమని తేల్చినా..
గత ప్రభుత్వంలో విచారణ జరిపి.. అతనిపై మోపిన అభియోగాలు నిరాధారమని విచారణాధికారి తేల్చారు. ఈ నివేదిక పంపి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా పూర్తి పెన్షన్ మంజూరవ్వలేదు. కోర్టును ఆశ్రయించగా.. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ 9 నెలల క్రితం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో తాను మానసికంగా కుంగిపోయానని.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని మూర్తి కన్నీరుపెట్టుకున్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయానని.. అందుకే బలవన్మరణం కోసం రాష్ట్రపత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.