నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవిపై విచారణ జరపండి | Police ignore complaint about money laundering | Sakshi
Sakshi News home page

నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవిపై విచారణ జరపండి

Apr 3 2026 5:27 AM | Updated on Apr 3 2026 5:27 AM

Police ignore complaint about money laundering

కలెక్టర్‌కు ఈసీ ఆదేశం 

అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక అక్రమాల నేపథ్యం 

ఉద్యోగులకు అదనపు వేతనాలు 

ఆపై రౌండ్‌ ట్రిప్పింగ్‌తో తిరిగి వసూలు.. ఎన్నికల్లో ఖర్చు 

మనీ లాండరింగ్‌పై ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు 

దీంతో ఈసీని ఆశ్రయించిన ఫిర్యాదుదారు

సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌/ జిల్లా ఎన్నికల అధికారి ఎన్‌.రాంసుందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. 

నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారికంగా చూపించిన లెక్కలకు, వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకు చెందిన మిరాకల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టం సంస్థలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.  ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వేతనాల రౌండ్‌ ట్రిప్పింగ్‌ తీరిది 
ఫిర్యాదు ప్రకారం.. మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రతినెలా ఇచ్చే జీతం కాకుండా అదనంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు జమ అయ్యేది. తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి వెనక్కి తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేశారు. 

నిజానికి ఈ వ్యవహారంపై సదరు మాజీ ఉద్యోగి తొలుత భోగాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అయితే ఆర్థిక అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలు లేవంటూ కేసును మూసివేశారు. అనంతరం ఆయన ఇదే అంశంమీద విజయనగరం డీఎస్పీ, ఏఎస్పీలతో పాటు విశాఖ రేంజ్‌ డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మార్చి 31న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

కాగా, సార్వత్రిక ఎన్నికల్లో పకడ్బందీగా మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యే నాగమాధవి, త్వరలో జరగనున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  అధికార కూటమి ఎమ్మెల్యేగా మున్ముందు మరిన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement