
బినామీలు, అస్మదీయులను అడ్డం పెట్టుకుని వైద్య కళాశాలలు హస్తగతం చేసుకునే దిశగా అడుగులు
పీపీపీ పేరిట ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తుల నిలువు దోపిడీకి ప్రభుత్వ పెద్దల కుట్ర
మదనపల్లె వైద్య కళాశాలను ముందే సందర్శించిన కీలక మంత్రి ప్రతినిధులు
కళాశాలలో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల పరిశీలన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలపై ప్రై‘వేటు’ వేసేందుకు ముందుగానే ప్రణాళికలు రచించి బంపర్ స్కామ్‌కు బాబు సర్కారు తెరతీయడం వైద్యవర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం పెట్టి లీజు పేరిట కారుచౌకగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసిన విషయం తెలుసుకుని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కారుచౌకగా వచ్చే కళాశాలలను కైవసం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే పావులు కదిపారు.
రాష్ట్ర కేబినెట్‌లో కీలక పాత్ర వహిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ స్కామ్ నడిపేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. స్వతహాగా విద్యావేత్త అయిన ఆయనకు ఇప్పటికే స్కూల్స్, ఇంటర్ కాలేజీలతో పాటు మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలున్నాయి. ఆయన విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు మదనపల్లె కళాశాలలను కొన్ని నెలల ముందే సందర్శించారు. కళాశాలలో ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, ఆసుపత్రులను పరిశీలించి, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తాజాగా మరికొన్ని కళాశాలలను కూడా పరిశీలించినట్టు తెలిసింది.
పీపీపీ పేరిట కొట్టేసేందుకు పకడ్బందీ వ్యూహం
ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) స్కీమ్ పేరిట ప్రభుత్వం భారీ స్కామ్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా ఇద్దరు ముఖ్యనేతలతో పాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ బినామీలు, అస్మదీయులను అడ్డంపెట్టి కారు చౌకగా ప్రభుత్వ సంస్థలను కాజేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
రూ.5 వేలకే 50 ఎకరాల భూమి లీజుకు ఇవ్వడమే కాకుండా, 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే గతేడాది జూన్‌లో ప్రభుత్వం కొలువైన వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను ఆపేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి 750 ఎంబీబీఎస్ సీట్లతో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, పాడేరు, ఆదోని వైద్య కళాశాల ప్రారంభించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసినప్పటికీ సీట్లు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు.
గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వచ్చిన సీట్లను సైతం రద్దు చేయమని కుట్రపూరితంగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)కి లేఖ రాశారు. పీపీపీలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు చేశారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలో మాదిరిగా ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి నిరి్మ ంచిన వైద్య కళాశాలలను సగంలో ప్రైవేట్‌కు అప్పగించలేదు.
కేవలం భూములు మాత్రమే లీజుకు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కళాశాలలు నెలకొల్పేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు మాత్రం 80 శాతం మేర నిర్మాణం పూర్తయి, చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలు, బోధనాస్పత్రులను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే కుట్రకోణం పూర్తిగా స్పష్టం అవుతోంది.