Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం

Photo Feature Women Workers Eating, E Crop, Banana Gela, Sheep Vaccine - Sakshi

డైనింగ్‌ టేబుల్‌ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. 


విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం.     – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం  


చకచకా ఈ–క్రాప్‌ 

జిల్లాలో ఈ–క్రాప్‌ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్‌ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్‌ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు.                      
– నెల్లిమర్ల రూరల్‌  


ముందస్తు వైద్యం 

వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. 
– రామభద్రపురం  


ఐదు అడుగుల అరటిగెల.. 

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్‌ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్‌ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్‌: మొబైల్‌ మిస్సయ్యిందా..? జస్ట్‌ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్‌ సేఫ్‌!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top