తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ కోసం కొన్నిచోట్ల వాహనదారులు బారులు తీరుతున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డీజిల్ సమస్య ఎక్కువగా ఉంది.
ఏపీలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్‌ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్‌కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్‌కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు.
ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్‌లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్‌లలో విక్రయాలు ఆపేశారు.
తెలంగాణలో పరిస్థితి ఇది..
తెలంగాణలో ఇంధన కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ చెబుతున్నప్పటికీ పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో మాత్రం ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కొరతతో పలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. ఖమ్మం నగరంతో పాటు అశ్వారావుపేట మండలం వినాయకపురం బంకు వద్ద.. కల్లూరు, మణుగూరు, సత్తుపల్లిలో పెట్రోల్ కోసం వాహనదారులు బారులుతీరారు. వేంసూరు ఐఓసీ బంకు దగ్గర అయితే పెద్దపెద్ద డబ్బాల్ని వరుసలో పెట్టారు.
హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్ సహా కొన్నిచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతాచోట్ల పరిస్థితి సాధారణంగానే ఉంది.
సూర్యాపేట జిల్లాలో పదిహేనుకుపైగా పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేసి నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతావాటిలో ఎక్కువ బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు. డీజిల్ ఉంటే పెట్రోల్ లేదు. మద్దిరాలలోని ఓ బంకులో మూడ్రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ లేవు.
కోదాడ పట్టణంలోని ఓ బంకు నిర్వాహకుడు రెండు ట్యాంకర్ల కోసం ఆయిల్ సంస్థకు సుమారు రూ.25 లక్షలు మూడ్రోజుల క్రితం చెల్లించారు. ఆదివారం నాటికీ ఇంధనం రాకపోవడంతో బంకును మూసేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నాలుగు బంకులు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ కొరతతో వారంలో నాలుగురోజులే తెరిచి ఉంటున్నాయి. ఇప్పుడు ప్రధాన బంకు సహా రెండు తాత్కాలికంగా మూసి ఉన్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని ఐవోసీ బంకులో శుక్రవారం సాయంత్రానికే స్టాకు అయిపోయింది. మళ్లీ సోమవారం స్టాకు వస్తుందని సిబ్బంది తెలిపారు.


