కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు

Other States On The AP Path To Control The Corona Fight - Sakshi

దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విధానాలు

45 ఏళ్లు దాటిన వారికే తొలుత వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్న సీఎం

వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని నిర్ణయం

వాస్తవాన్ని గుర్తించి ఇవే నిర్ణయాల అమలుకు ఇతర రాష్ట్రాలూ సిద్ధం

సీఎం జగన్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు

సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ మొదట 45 ఏళ్లు దాటిన వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాతే 18 – 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి వేయడం ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శించింది.

కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం తదితర రాష్ట్రాలు కూడా మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్లు వేస్తామని ప్రకటించాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా కేవలం కొన్ని రోజుల్లోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనించి వాస్తవాన్ని గుర్తించి ఏపీ ప్రభుత్వ విధానంలోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్టాటక, తెలంగాణ రాష్ట్రాలు తాము ప్రస్తుతం 18 ఏళ్లు నుంచి 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్లు వేయలేమని తేల్చి చెప్పాయి. చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం కూడా మొదట 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని తేల్చి చెప్పాయి.

వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు..
మన అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు సకాలంలో దేశీయంగా లభించనందున వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు అవసరం ఏమిటన్న ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఏపీ బాట పట్టనున్నాయి. తాజాగా వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్లోబల్‌ టెండర్లు వేసింది. జూన్‌ 3 నాటికి ఆ టెండర్లు తెరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా తాజాగా నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి. శాస్త్రీయ దృక్పథంతో కూడిన ఆచరణాత్మక విధానం అనుసరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విధానాలపై జాతీయ స్థాయిలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top