నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా

Nimmagadda ramesh kumar Used Rude language In Governor Letter - Sakshi

గవర్నర్‌నే శాసించేలా ఎస్‌ఈసీ లేఖ రాయడంపై నిపుణుల విస్మయం 

నిమ్మగడ్డ తన పరిధిని పూర్తిగా అతిక్రమించారని స్పష్టీకరణ 

గవర్నర్‌ విచక్షణాధికారాల్లో అనుచిత జోక్యం.. తాను చెప్పినట్లు చేయకుంటే కోర్టుకు వెళ్తానంటూ బెదిరింపులు 

లేఖలో వాడిన భాష, భావం పట్ల సర్వత్రా అభ్యంతరాలు  

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అధిపతి హోదాలో ఉన్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ను శాసించే రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ లేఖ రాయడంపై న్యాయ కోవిదులు, నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ను ఉద్దేశించి శుక్రవారం రాసిన లేఖలో నిమ్మగడ్డ  ఉపయోగించిన భాష, తద్వారా ప్రస్ఫుటమైన భావం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, తద్వారా రేఖ దాటారని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పనితీరును విమర్శిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా తన ఫిర్యాదుపై స్పందించి గవర్నర్‌ ఏం చేయాలో కూడా నిర్దేశించడం కచ్చితంగా పరిధి దాటటమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

ఆదేశించే అధికారం ఎక్కడిది? 
‘ఈ వ్యవహారంపై రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ను సంప్రదించవద్దు... కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించండి’ అని హుకుం జారీ చేస్తున్నట్లుగా గవర్నర్‌కు చెప్పడమంటే.. తన దృష్టికి వచ్చిన ఓ అంశంపై ఎలా వ్యవహరించాలో గవర్నర్‌కు తెలియదన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘గవర్నర్‌ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, నిపుణులను సంప్రదించి తగిన విధంగా స్పందిస్తారు. అది ఆయన విచక్షణాధికారాలకు సంబంధించిన విషయం. కానీ అందులో నిమ్మగడ్డ అనుచిత జోక్యం చేసుకోవడం ద్వారా తన పరిధిని పూర్తిగా అతిక్రమించారు’ అని రాజ్యాంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ను సంప్రదించవద్దని, కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించాలని గవర్నర్‌ను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎక్కడిదని వ్యాఖ్యానించారు.  

ఆనవాయితీ ప్రకారం చూసినా.. 
‘నిమ్మగడ్డకు విశ్వాసం లేకుంటే ఆయన సంప్రదించకూడదు. కానీ గవర్నర్‌ ఎందుకు సంప్రదించకూడదో అర్థం కావడం లేదు. అంటే తనకు విశ్వాసం లేదు కాబట్టి గవర్నర్‌ కూడా విశ్వసించరాదని ఆదేశించినట్లుగా ప్రవర్తించారు. అడ్వొకేట్‌ జనరల్‌పై గవర్నర్‌ తన పరిశీలనతో ఓ అంచనాకు వస్తారు. సంప్రదించాలో లేదో ఆయన నిర్ణయించుకుంటారు. అంతేగానీ తన ఆంతర్యాన్ని గవర్నర్‌పై రుద్దాలని ఎస్‌ఈసీ భావించడం సరికాదు’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా రాజ్యాంగపరమైన నిబంధనలు, ఇతర అంశాలపై గవర్నర్‌ తొలుత రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌నే పిలిపించి మాట్లాడటం సంప్రదాయమని గుర్తు చేశారు.  

చివరిసారిగా చెబుతున్నా.... 
నిమ్మగడ్డ హుకుం జారీ చేసినట్లుగా ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు వేస్తానని గవర్నర్‌ను హెచ్చరించే ధోరణిలో లేఖ రాయడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ‘మీకు చివరిసారిగా చెబుతున్నా..’ అని గవర్నర్‌నుద్దేశించి లేఖలో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘మంత్రులకు సూచించండి... నిర్దేశించండి... వారి నుంచి హామీ తీసుకోండి’ అంటూ లేఖ రాయడం గవర్నర్‌ను ఆదేశిస్తున్నట్లుగా ఉందని తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరో రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్న అడ్వొకేట్‌ జనరల్‌ను తూలనాడుతూ, అవమానిస్తున్నట్లుగా లేఖలో సంబోధించడం.. చివరకు గవర్నర్‌ను సైతం ఆదేశించేలా లేఖ రాయడం కచ్చితంగా లక్ష్మణ రేఖను దాటటమేని పేర్కొంటున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top