కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు

NCERT New Text Books from 2024 2025 - Sakshi

2024–25 నుండి ఎన్‌సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాలు

20 ఏళ్ల తర్వాత కొత్త పుస్తకాలు

ప్రింటుతో పాటు డిజిటల్‌ రూపంలోనూ అందుబాటులోకి

5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో ముద్రణ

ప్లే–వే పద్ధతి బోధనతో పుస్తకాలు

బాలల్లో సమస్యల పరిష్కార మెళకువలు, సామాజిక భావో­ద్వేగ సామర్థ్యాల పెంపుపై దృష్టి

సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పా­ఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరి­శోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జా­తీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్‌సీఈఆర్టీ ప్రకటించింది.

కోవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్‌సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్‌ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్‌సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్‌సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్‌సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్‌ను బాలలకు అందించనున్నట్లు ఎన్‌సీఈఆర్టీ వివరించింది.

ఈ పుస్తకాలు ప్లే బుక్‌ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు  ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్‌ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్‌  ఫ్రేమ్‌వర్కును ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది.

ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్‌ఈపీ మార్గదర్శకాలు
ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్‌ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్‌సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్‌ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్‌ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్‌సీఈఆర్టీ పరిశీలిస్తోంది. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top