లోకేశ్ విదేశీ రహస్య పర్యటనకు వెళ్లినట్టు టీడీపీలో గుసగుసలు
ఎక్కడికి వెళ్లారోనని కూటమి పార్టీల్లో ఒకటే చర్చ
మంత్రిగా ఉండి తరచూ రహస్య టూర్లు ఏమిటని సొంత పార్టీలోనే అసహనం
జనవరిలో తండ్రి, తనయుడు.. ఇప్పుడు తనయుడు ఒక్కడే
వారి రహస్య పర్యటనలపై ఎన్నో సందేహాలు
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ వారం రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా ఎటో వెళ్లిపోవడంపై టీడీపీ కూటమి పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎక్కడికెళ్లారో.. ఎందుకు వెళ్లారోనని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి చినబాబు రాష్ట్రంలో లేరని, విదేశీ పర్యటనకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి జీఓ విడుదల కాలేదు. రహస్యంగా జీఓ ఏమైనా ఇచ్చారేమో లేదో తెలియదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అఖిల భారత సర్వీసులు సహా వివిధస్థాయి అధికారులు విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు జారీ చేస్తారు. సీఎం, మంత్రులు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా జీవోలు ఇస్తారు. భద్రతా ఏర్పాట్ల కోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ.. 2024లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఎవరికీ తెలియకుండా ప్రత్యేక విమానాల్లో రహస్య పర్యటనలు చేస్తున్నారు. అందులో చాలావరకూ విదేశీ పర్యటనలు ఉంటున్నాయి.
జనవరిలో తండ్రీకొడుకుల రహస్య టూర్
గత ఏడాది డిసెంబర్ నెలాఖరున చంద్రబాబు,కలోకేశ్ కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. 2026 జనవరి మొదటి వారంలోనూ వారిద్దరూ రాష్ట్రంలో లేరు. ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారనే సమాచారం ఇప్పటివరకూ బయటకు వెల్లడించలేదు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా జీఓ ఇచ్చి తన కుమార్తె కోసం లండన్ వెళితే దానిపై నానా రాద్ధాంతం చేసి అనేక విమర్శలు చేశారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా అప్పట్లో లేపిన గాసిప్‌లు అన్నీఇన్నీ కావు.
అధికారికంగా అందరికీ తెలిసి పర్యటన చేస్తే ఇష్టానుసారం రభస చేసి ఇప్పుడు వారు మాత్రం రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తుండటం గమనార్హం. పారదర్శకత, జవాబుదారీతనం ఎదుటి వారికే తప్ప తమకు వర్తించదని చంద్రబాబు, ఆయన కుమారుడు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు పారదర్శకంగా ఉన్నా తాము ఇష్టానుసారం మాట్లాడతాం, తాము అన్నీ రహస్యంగా చేసినా తమను ఎవరూ ఏమీ అనకూడదనే రీతిలో చంద్రబాబు కుటుంబ వ్యవహారం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతా రహస్యమే
జీవోలను సైతం గోప్యంగా ఉంచడం, అసలు జీఓలే విడుదల చేయకుండా వారు విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు తమ పర్యటనల సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. ఏదో ఒకసారి అంటే ఆరోపణలు, విమర్శలను తిప్పికొడతామని... తరచూ ఇలా చేస్తే తమకు విలువ ఏముంటుందని వాపోతున్నారు.
అంత రహస్యంగా పర్యటించాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సీఎం తనయుడైతే అధికారంలోకి వచి్చన 22 నెలల్లో పదులసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అందులో సగం వ్యక్తిగత పర్యటనలే. చాలాసార్లు ఆయన ఏ దేశం వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. అంత గోప్యంగా విదేశాల్లో పర్యటిస్తున్నారంటే.. ఏదో మతలబు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.


