నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా.. 

Missing Man Who Went For Swim In Gunjana River has Died - Sakshi

 కుమారుడి మృతదేహం వద్ద తల్లి ఆక్రందన

ఏటిలో గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం లభ్యం

సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్‌కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది.

గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్‌లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు.  

శివరామకృష్ణకు నివాళి 
ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. 

ఫలించిన కొరముట్ల కృషి 
శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్‌ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. 

శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు

మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్‌ కొరముట్ల

   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top