18న గోదావరి–కావేరి అనుసంధానంపై భేటీ

Meeting On Godavari Cauvery Rivers Linking On 18th September - Sakshi

బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్రం కసరత్తు

రాష్ట్ర అవసరాలు తీర్చాకే ఇతర ప్రాంతాలకు తరలించాలి: ఏపీ

సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై వాటి పరీవాహక ప్రాంతాల (బేసిన్‌) పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్య్లూడీఏ) డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌ సింగ్‌ అధ్యక్షతన ఈనెల 18న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆ రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేంద్ర జల్‌ శక్తి శాఖ.. బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలతో మరోసారి సమావేశమై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గత నెల 24న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పింది. రాష్ట్ర అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలని స్పష్టం చేసింది. 18న నిర్వహించే భేటీలోనూ అదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించాలని నిర్ణయించింది.

ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు ఇవీ.. 
► కర్ణాటక–తమిళనాడుల మధ్య తరచుగా కావేరీ జలాల విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. 
► గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకు గోదావరి జలాలను తరలించి వివాదాలకు చెక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 
► గోదావరి–కావేరీ అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ మూడు ప్రతిపాదనలు చేసింది. అవి.. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట) అకినేపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట) జానంపేట(గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా)–సోమశిల(పెన్నా)–కావేరి(గ్రాండ్‌ ఆనకట్ట). 
► గోదావరి నుంచి మొత్తం 247 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించింది. ఇందులో ఇచ్చంపల్లి, అకినేపల్లిల నుంచి ఎత్తిపోసే జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొంది. జానంపేట నుంచి ఎత్తిపోసే గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది.
► గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,486.155 టీఎంసీలను కేటాయించింది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మూడు ప్రత్యామ్నాయాల్లోనూ గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే తీసుకుంది. కానీ.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరిలో మిగులు జలాలు లేవనీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top