
దుకాణాలను ప్రైవేటీకరించి, సంఖ్యను పెంచిన చంద్రబాబు సర్కార్
బెల్ట్‌షాపులు, పర్మిట్ రూమ్‌లను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్న వైనం
ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరగాలి
కానీ, ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో వచ్చినది రూ.6,992.77 కోట్లే
నిరుడు ఈ విధానం అమల్లో లేకపోయినా రూ.6,782.21 కోట్ల ఆదాయం
అంటే గత ఏడాదితో పోల్చితే... పెరిగిన రాబడి కేవలం 3.10 శాతమే
దీన్నిబట్టి చూస్తే మద్యం విధానంలో భారీ దోపిడీ సాగుతోందని స్పష్టమవుతోంది
వైఎస్సార్‌సీపీ ధ్వజం... కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ మండిపాటు
సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్‌ట్యాగ్‌తో జాతీయ మీడియాను జత చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడంలో భారీగా అవినీతి జరిగిందని.. ఈ ప్రభావం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంపై తీవ్రంగా పడిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఈ కారణంగా రాబడి పెరుగుదల కేవలం 3.10 శాతానికే పరిమితం అయిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాబడి రూ.6,992.77 కోట్లు మాత్రమేనని రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
మద్యం అమ్మకాల్లో సాగుతున్న దోపిడీని కడిగిపారేస్తూ.. సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ ట్యాగ్‌తో జాతీయ మీడియాను జత చేస్తూ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఏమన్నదంటే... ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం, దుకాణాల సంఖ్యను పెంచడం, అక్రమ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్‌లను తిరిగి ప్రవేశపెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది.
సహజంగా ఈ విధానపరమైన మార్పులు మద్యం వినియోగం భారీ పెరుగుదలకు దారితీసి... ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయాలు పెరగాలి. ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి ఐదు నెలల్లో ఈ విధానపరమైన మార్పులన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ మార్పులేవీ లేవు. కాబట్టి.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఎక్సైజ్ ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండాలి.
కానీ, గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో అదే వ్యవధిలో రాబడి రూ.6,992.77 కోట్లు అని కాగ్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్నిబట్టి గత ఏడాదితో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం కేవలం 3.10 శాతం మాత్రమే పెరిగింది.
విధానపరమైన మార్పులు లేనప్పటికీ... సాధారణ సమయంలో సగటున పది శాతం ఆదాయాలు పెరగాలి. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం తగ్గి, ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది మద్యం విధానంలో అవినీతిని ప్రస్ఫుటితం చేస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.