తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Many Celebrities Visited Tirumala Srivari Temple - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజీర్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  సినీనటుడు రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ గోపిచంద్‌లు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.

అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసిందని అన్నారు. నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందన్నారు.

త్వరలో హీరో బాలకృష్ణతో సినిమా: దర్శకుడు గోపిచంద్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి కులదైవం తిరుమల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో  హీరో బాలకృష్ణ తో చిత్రం నిర్మిస్తున్నానని గోపిచంద్ స్పష్టం చేశారు.

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో ఆమెను సత్కరించారు. అదేవిధంగా.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా న్యాయమూర్తి శుక్రవారం దర్శించుకున్నారు. కాగా, అంతకు ముందు రోజు గురువారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని జస్టిస్‌ బీవీ నాగరత్న కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ శ్రీసుధా
తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధా శుక్రవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top