సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో మంగళవారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


