భూ వివాదాలు బంద్‌ 

Land Disputes Bandh with Comprehensive land survey in Andhra Pradesh - Sakshi

సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ 

నామమాత్రపు రుసుముతో సాదా బైనామాల క్రమబద్ధీకరణ 

భూముల రికార్డుల్లో సంస్కరణలు.. శాశ్వతంగా నిలిచేలా విధానాలు 

భూ వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి సచివాలయాల స్థాయిలో యంత్రాంగం 

సమగ్ర భూ సర్వేపై అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగానే రికార్డుల్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా, తక్కువ రుసుముతో చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా భూ వ్యవహారాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పారదర్శక విధానాలు అమలు చేయాలని,  వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఉండాలని నిర్దేశించారు. గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2023 జూన్‌ నాటికి పథకాన్ని పూర్తి చేస్తామని, రెవెన్యూ డివిజన్‌కు మూడేసి డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు.  

పారదర్శకతకు పెద్దపీట 
భూ వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేయాలి. విక్రయించిన వారు, కొనుగోలు చేసినవారు మోసాలు, ఇబ్బందులకు గురి కాకూడదు. భూమి రిజిస్ట్రేషన్‌ అయ్యే నాటికి సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియలు పూర్తి చేయాలి. దీనివల్ల వివాదాలు, సమస్యలు లేకుండా రికార్డుల్లో స్పష్టత ఉంటుంది. స్పష్టమైన సబ్‌ డివిజన్, రికార్డుల్లో మార్పులు, సర్వహక్కులతో కొనుగోలుదారులకు భూమి దఖలు పడాలి. దీనిపై అధికారులు సమగ్ర విధానాన్ని సిద్ధం చేయాలి. వివాదాలు కొనసాగుతుంటే జీవితాంతం భూ యజమానులను, కొనుగోలు చేసిన వారిని వెంటాడతాయి. ఇప్పుడున్న విధానాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి విధానాలు అందుబాటులోకి తీసుకురావాలి.  

విధానాలే శాశ్వతం.. 
భూ రికార్డుల్లో సంస్కరణలు తేవాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ వ్యవస్థ ఉండాలి. రికార్డుల క్రమబద్ధీకరణలో పారదర్శకతకు పెద్దపీట వేసి చిరకాలం నిలిచిపోయేలా విధానాలు ఉండాలి. తమకు ఇష్టం లేదని రికార్డుల్లో పేర్లు తొలగించడం, నచ్చినవారి పేర్లను చేర్చడం లాంటి వాటికి ఇకపై చోటు ఉండకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా అనుసరిస్తున్న విధానాలు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలి.  

నామమాత్రపు రుసుముతో.. 
గిఫ్ట్‌లు, వారసుల మధ్య పంపకాలకు రిజిస్ట్రేషన్‌ను ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను బలోపేతం చేయడం, రికార్డులు సమర్థవంతంగా నిర్వహించడం, గిఫ్టు రూపేణా వచ్చిన భూమిపై న్యాయపరంగా అన్ని హక్కులు సంక్రమించేందుకు ఇది ఉపకరిస్తుంది. సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు తగిన విధానాలు తీసుకురావాలి. దీనివల్ల రికార్డుల ప్రక్షాళనకు అవకాశం లభిస్తుంది. వీటికోసం విధించే రుసుములు నామమాత్రంగా ఉండాలి. దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. 

చుక్కల భూముల వివాదాలకు పరిష్కారం 
దీర్ఘకాలంగా తేలని చుక్కల భూముల వివాదాలను పరిష్కరించాలి. లేదంటే ఈ వివాదాలు తరతరాలుగా ప్రజలను వేధిస్తాయి. భూ వివాదాలు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపేందుకు గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఏర్పాటుపై ఎస్‌వోపీ రూపొందించాలి. నిర్దిష్ట కాల పరిమితితో వివాదాలు పరిష్కారం కావాలి. అంతేకాకుండా ఆ వివరాలు రికార్డుల్లో నమోదు కావాలి. లంచాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదు. రికార్డులు తారుమారు చేయలేని విధంగా విధానాలు ఉండాలి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సచివాలయాల సిబ్బందికి తగిన శిక్షణ, అవగాహన కల్పించాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top