కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ | Sakshi
Sakshi News home page

కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌

Published Sat, Apr 2 2022 4:36 AM

Kuppam To Become Revenue Division In Chittoor District - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, కుప్పం, శాంతిపురం, గూడుపల్లె, రామకుప్పం మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మండలాలు ప్రస్తుతం మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, కుప్పం మారుమూల ప్రాంతంగానే మిగిలిపోయింది.

ఆయన ఎప్పుడూ కుప్పంకు పరిపాలనా ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా కొత్త జిల్లాల విభజన సమయంలో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తోంది. కుప్పంతోపాటు మరో 21 కొత్త రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఏర్పడనున్నాయి.

సగటున 6 నుంచి 12 మండలాలతో ఒక్కో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. 13 జిల్లాల్లో 3 రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతుండగా, 9 జిల్లాల్లో 2, నాలుగు జిల్లాల్లో నాలుగేసి చొప్పున రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా ఏర్పడే 22తో కలిపి 73 రెవెన్యూ డివిజన్లు అవుతాయి. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడో, రేపో వెలువరించనుంది.

Advertisement
Advertisement