కరువు నేలలో కృష్ణమ్మ పరుగులు

Krishna Waters To 68 Ponds In Kurnool District - Sakshi

జిల్లాలోని 68 చెరువులకు కృష్ణా జలాలు

మూడు గ్రావిటీల్లో నీటి విడుదలకు ఏర్పాట్లు

80 శాతం పైప్‌లైన్‌ పనులు పూర్తి

సెప్టెంబర్‌లో ట్రయల్‌ రన్‌  విజయవంతం

నాలుగు నియోజకవర్గాలకు చేకూరనున్న ప్రయోజనం

పదివేల ఎకరాలకుపైగా  అందనున్న సాగునీరు

వర్షం పడితేనే పంటలు పండే నేలలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి.  కృష్ణమ్మ జల స్పర్శతో చెరువులు సైతం పులకించనున్నాయి. ఇందుకోసం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో త్వరలోనే రైతుల కల సాకారం కానుంది. 

కృష్ణగిరి(కర్నూలు): జిల్లాలోని çపత్తికొండ, డోన్, ఆలూరు, కర్నూలు నియోజకవర్గాలకు గతంలో సాగునీటి వనరులు తక్కువగా ఉండేవి. వరుణుడి కరుణతోనే పంటలు పండేవి. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని కృష్ణా జలాలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు 2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలను చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లేలా నిధులు మంజూరు చేసి పనులు సైతం పూర్తి చేయించారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే కాలువకు నీరు విడుదల చేసి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు అప్పటి మంత్రులు పాదయాత్ర చేపట్టారు. జిల్లాలో ఏడు ఎత్తిపోతల పథకాలు, రెండు రిజర్వాయర్‌లతోపాటు రెండు చానల్‌ కాల్వల ద్వారా 80వేల ఎకరాలకు అధికారికంగా సాగునీరు ఇస్తున్నారు. ఇదంతా దివంగత నేత వైఎస్సార్‌ పుణ్యమే అని ఇక్కడి ప్రజలు నిత్యం స్మరించుకుంటున్నారు.  

68 చెరువులకు హంద్రీ–నీవా నీరు 
హంద్రీ–నీవా ప్రాజెక్టుతో బీడు భూములను వైఎస్సార్‌ సస్యశ్యామలం చేయిస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి హంద్రీ–నీవా ప్రధాన కాల్వ నుంచి 68 చెరువులకు నీరు మళ్లించే పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ సమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ 90 కి.మీ దగ్గర పంప్‌హౌస్‌ నిర్మించారు. ఇందులో 3,800 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్ల నుంచి కటారుకొండ పంచాయతీ పరిధిలోని పులిచెర్ల సమీపంలో డెలివరీ చాంబర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మూడు ౖపైపుల ద్వారా నీరు చెరువులకు మళ్లించనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు డోన్, ప్యాపిలి, కల్లూరు, దేవనకొండ మండలాల్లోని 68 చెరువులకు పైపుల ద్వారా నీరు వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 186 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 160 కోట్లు  ఖర్చు చేసింది. 

పంటలు పూర్తయిన వెంటనే డిస్ట్రిబ్యూటరీ పనులు
కృష్ణగిరి మండల పరిధిలోని పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్‌ నుంచి మూడు గ్రావిటీల ద్వారా చెరువులకు నీరు మళ్లించే మెయిన్‌ పైప్‌లైన్‌ పనులు 80 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ పంటలు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. పంట కాలం పూర్తయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

అన్ని అనుమతులు వచ్చాయి 
68 చెరువులకు నీరు మళ్లించే పథకానికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా ఉండేవి. అయితే  ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చాయి. మెయిన్‌ పైప్‌లైన్‌ దాదాపుగా 80 శాతానికిపైగా పూర్తి చేశాం. డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చేపట్టాల్సి ఉంది. పొలాల్లో రైతులు పంటలు తీస్తే ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తాం. డిసెంబర్‌ నాటికి 30 చెరువులకు పైగా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 
– నారాయణరెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ

మూడు గ్రావిటీలు ఇవే..  
గ్రావిటీ–1: పులిచెర్ల సమీపంలోని కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్‌ నుంచి 41.52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డోన్, వెల్దుర్తి, కల్లూరు, కృష్ణగిరి మండలాల్లోని 22 చెరువులకు నీరు చేరుకుంటుంది. 4,217ఎకరాలకు నీరు అందనుంది. 

గ్రావిటీ–2: డెలివరీ చాంబర్‌ నుంచి నీరు 21.20 కిలోమీటర్లు ప్రయాణించి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లోని 16 చెరువులకు చేరుతుంది. మొత్తం 3,018 ఎకరాలకు నీరు పారనుంది. 

గ్రావిటీ–3: డెలివరీ చాంబర్‌ నుంచి నీరు 38 కిలోమీటర్లు దూరం ప్రయాణించి డోన్, ప్యాపిలి, తుగ్గలి మండలాల్లోని 30 చెరువులకు చేరుతుంది. ఆయా మండలాల్లో 2,898 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. 

ట్రయల్‌ రన్‌ విజయవంతం 
హంద్రీ– నీవా కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు సెప్టెంబర్‌ నెలలో డీఈలు రవీంద్రనాథ్‌రెడ్డి, రామకృష్ణ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని పులిచర్ల సమీపంలోని డెలివరీ చాంబర్‌లోకి వదిలారు. అక్కడి గ్రావిటీ–1 పైపులైన్‌ ద్వారా కృష్ణగిరి మండలంలోని కటారుకొండ తుమ్మల చెరువు, కర్లకుంట, డోన్‌ మండలంలోని మల్లెపల్లె, వెంకటాపురం, జగదుర్తి చెరువులకు నీటిని పంపించారు. అలాగే గ్రావిటీ–2 పైప్‌లైన్‌ ద్వారా ఆలంకొండ గ్రామంలోని బోయినాల, కూర్మగిరి, తుగ్గలి మండలంలోని బొందిమడుగుల, చందోళి, చక్రాళ్ల, ముకెళ్ల  చెరువుల్లోకి నీటి విడుదల విజయవంతమైంది. దీంతో ఈ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉంటాం 
వైఎస్సార్‌ చలువతో మా గ్రామానికి సమీపంలోనే హంద్రీ–నీవా కాలువ ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీరు వదిలే పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోయినాల, కూర్మగిరి చెరువులకు త్వరలోనే నీరు వదులుతామంటున్నారు. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉంటాం.      
– ఆర్‌బీ వెంకటరాముడు, ఆలంకొండ

ప్రతి ఏడాది వరి సాగు చేస్తాం 
హంద్రీ–నీవా కాలువకు మా గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. మా చెరువులకు నీరు వస్తుందనే ఆశ కూడా మాకు లేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేయిస్తున్నారు. చెరువులకు హంద్రీ–నీవా నీరొస్తే ప్రతి ఏడాది వరిసాగు చేస్తాం. 
– ఆదినారాయణ, వెంకటాపురం

భూగర్భ జలాలు పెరుగుతాయి  
మా గ్రామ చెరువు ఎప్పుడూ నిండింది లేదు. రెండేళ్ల కిందట ఒకసారి భారీ వర్షానికి నిండింది కానీ పంట సాగుచేస్తే చివరివరకు నీరు చాలలేదు. సెస్టెంబర్‌లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో మా చెరువులోకి హంద్రీ–నీవా నీరు వచ్చింది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే ప్రతి ఏటా వరి పండిస్తాం. బోరుబావుల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి.    
– జల్ల సుంకన్న, బొందిమడుగుల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top