విప్రో పోటీల్లో ‘కృష్ణా’ విద్యార్థుల సత్తా 

Krishna District students excel in national level competitions organized by Wipro - Sakshi

జాతీయస్థాయిలో మల్లవోలుకు మూడోస్థానం  

జీవవైవిధ్యం వెల్లివిరిసేలా విద్యార్థులు ప్రాజెక్టు రూపకల్పన 

రాష్ట్రం నుంచి ఎంపికైన ప్రాజెక్టు ఇదొక్కటే 

మచిలీపట్నం:  విప్రో సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. గైడ్, టీచర్‌ అరుణ పర్యవేక్షణలో విద్యార్థులు ఈ. వరలక్ష్మి, కే యశశ్విని, టీ శ్రీదేవి, జీ మనోజ్ఙ, కే లోకేష్‌లు రూపొందించిన ‘జీవవైవిధ్య పరిరక్షణ’ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా 20 అత్యుత్తమ ప్రాజెక్టులను సంస్థ ఎంపిక చేయగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మల్లవోలు విద్యార్థులు మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాఠశాలకు రూ.50 వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం అందించారు.  అంతరించిపోతున్న జీవరాశులను ఎలా కాపాడుకోవాలనే దానిపై పాఠశాల విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రాజెక్టు రూపొందించారు. బయాలజీ టీచర్‌ నాదెండ్ల అరుణ ప్రధానోపాధ్యాయులు వి. పాండురంగారావు సహకారంతో సైన్సు క్లబ్‌ ఏర్పాటుచేసి జీవ వైవిధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టారు. వ్యర్థ పదార్థాలతో వస్తువుల తయారీ (రీ సైకిల్‌), ప్లాస్టిక్‌ నిర్మూలన, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే వాటిని వినియోగించి వస్తువులు తయారుచేయటం వంటి అంశాలపై ప్రాజెక్టులను సిద్ధంచేశారు. దీనిని పుస్తక రూపంలో తీర్చిదిద్ది ఫిజికల్‌ డైరెక్టర్‌ సిద్ధినేని శ్రీనివాసరావు సాంకేతిక సహకారంతో విప్రో సంస్థకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు.

గ్రామస్తుల సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు, విద్యార్థులు చూపిన జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలకు మెచ్చిన సంస్థ ప్రతినిధులు మల్లవోలు పాఠశాలకు బహుమతి ప్రకటించారు. విద్యార్థులు, పాఠశాల విద్యార్థులను డీఈఓ తాహెరా సుల్తానా, మచిలీపట్నం డెప్యూటీ డీఈఓ యూవీ సుబ్బారావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ నైపుణ్యత చాటుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తుండటం అభినందనీయమన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top