ఈ–కేవైసీపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు!

Kona Sasidhar Comments About E KYC - Sakshi

పరిస్థితిని బట్టి గడువు పొడిగింపు

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: ఆధార్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ పద్ధతిన వినియోగదారుల రేషన్‌ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ)పై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై రేషన్‌ లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కరపత్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. రేషన్‌ పంపిణీ చేసే వలంటీర్లు అవగాహన కల్పిస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ–కేవైసీ నమోదు బియ్యం కార్డుల తొలగింపు ప్రక్రియ కాదని, ఆధార్‌ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,102 ఆధార్‌ కేంద్రాలున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలనూ ఆధార్‌ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై బియ్యం కార్డుదారులకున్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బియ్యుంకార్డులోని ప్రతి సభ్యుడూ కచ్చితంగా ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా ఏమి పేర్కొన్నారంటే..

► కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ–కేవైసీ చేయించుకున్న లబ్ధిదారులు నిత్యావసర రేషన్‌ వస్తువుల్ని దేశంలో ఎక్కడి నుంచి అయినా పొందవచ్చు. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనమూ పొందవచ్చు.
► వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ–పోస్‌ యంత్రం ద్వారా ఫ్యూజన్‌ ఫింగర్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.
► వలంటీర్, చౌక ధరల దుకాణాల వద్ద ఈ–కేవైసీ నమోదు కాకపోతే మాత్రమే ఆధార్‌ కేంద్రాల వద్దకు వెళ్లాలి. 
► ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ, వార్డు వలంటీర్‌ వద్ద చేయించుకోవచ్చు.
► 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ–కేవైసీ అవసరం లేదు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వారికి వచ్చే నెలాఖరు లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి
► మిగతావారందరూ ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి
► పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top