తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్‌లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్‌ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి.
దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్‌తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు.
ఇవన్నీ రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నా పదేళ్లపాటు తానే సీఎం అని చెప్పడమే కొంత ఆశ్చర్యం. ఇలా చెప్పడం.. కేవలం ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించడానికా?లేక కాంగ్రెస్‌లో తనకు పోటీ లేదని చెప్పడానికా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?అంటే ఏమైనా కావచ్చు.రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు పదేళ్లనే ఏముంది.అంతకుమించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు.అలాగే ఆయనే సీఎంగా కొనసాగవచ్చు. అలాకాకుండా పదేళ్ల తర్వాత జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఏమి చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్‌లోనే ఉంటారా?అన్నది కొందరి అనుమానం.
కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ ను ఉద్దేశించి తనతో కలిసి రావాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.అది అధికారికంగా సహకారం కోరడం తప్పమరొకటి కాదని రేవంత్ వివరణ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా! గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి, తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ,ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఆయన ఆ మాట చమత్కారంగా చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్‌ఎస్‌లో కూడా పనిచేశారు.ఆ తర్వాత స్వతంత్రంగా జెడ్పీటీసీ పోటీచేసి గెలిచారు.
తదుపరి శాసనసమండలి ఎన్నికలలో పోటీచేసి అన్ని పార్టీలవారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి మద్దతు పొందడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో,మరేమో తెలియదు కాని, ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటు కు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనేం రెండున్నరేళ్ల సీఎం పదవికాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్న మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు, కర్ణాటక, హిమచల్ ప్రదేశ్ లలోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీకి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పాలి.
పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలికగా ప్రజలలో పట్టు నిలబెట్టుకోవడం అంత తేలికకాదు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీఆర్‌ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది.ఆయా అంశాలలో రేవంత్ విధానాలపై ఆ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది.హైడ్రా వ్యవస్థ వల్ల కొంత మంచి పేరు వచ్చినా, నష్టం కూడా గణనీయంగానే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని,వృద్దాప్య పెన్షన్ నాలుగువేలు చేస్తామని, దళితులకు పది లక్షల ఆర్థిక సాయం తదితర అనేక వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఎన్నికల సమయంలో చేశారు.వాటిని అమలు చేయడం అంత తేలిక కాదని అనుభవం చెబుతోంది. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. మరో రెండున్నర ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన రీతిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అది పదివేలు అన్నట్లుగా ఉంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ కేసులో కాని, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సందర్భంలో కాని రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్లే రేవంత్‌కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. భగీరధ అరెస్టు అయినప్పటికీ, అది జరిగిన తీరుపై విమర్శలు ఉన్నాయి.సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా అన్న చర్చ జరిగింది. 2028లో జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణం అంత తేలికగా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.అంతేకాక ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థంఅవుతుంది.బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్దతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది.
ఇక జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చీనీయాంశం కాదు.ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు.అది తప్పు కాదు.గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేశారు.వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సారధిగా ఉన్న టైమ్ లో ఏపీలో అత్యధిక కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు వచ్చాయి. అయినా ఆయనను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండేవారు.
ఆయన ఇంకా పూర్తిగా బలపడలేదు.ఆ టైమ్ లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసీసీ సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. అప్పట్లో తనకు ఉన్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులుకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద వ్యాఖ్యలు చేశారు.ఆ విషయం పీవీకి తెలియడంతో, తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా, అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు.మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక భూమిక పోషించారు.
సీఎంగా రెండుసార్లు ఎంపికయ్యారు.అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడు అన్న భావన ఉండేది.కాని ఆ రెండుసార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు.అప్పటి రాజకీయాలకు ప్రస్తుత ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీలలో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి.ఏది ఏమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికి అభ్యంతరం ఉండదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


