
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి.
అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.
2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న.
చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.
ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.
నిజానికి హైదరాబాద్‌లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్‌లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.
ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.
ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.