పవన్‌ రాజకీయాలు ఎవరి కోసం?: కాకాణి

Kakani Govardhan Reddy Slams On Pawan Kalyan Over Agriculture - Sakshi

పొదలకూరు: రైటర్లు ఇచ్చే స్క్రిప్ట్‌లతో సినిమాల్లో నటించి డబ్బులు సంపాదించడం తప్పా వ్యవసాయమంటే తెలియని పవన్‌కల్యాణ్‌ రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలం విరువూరు వద్ద ఆదివారం సంగం బ్యారే జీ పనులను పరిశీలించిన మంత్రి మాట్లాడా రు. పవన్‌కల్యాణ్‌కు రైతు జీవన విధానం, సంస్కృతి, వ్యవసాయంపై ఆయనకు ఉన్న అవగాహన, రైతాంగంపై ఉన్న చిత్తశుద్ధి చెప్పగిలితే ఆయన చెప్పే మాటలను వింటామన్నారు.

చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చాలని నిత్యం ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో పవన్‌కల్యాణ్‌ వంటి వ్యక్తులు రైతులపై మొసలికన్నీరు కార్చితే నమ్మే పరిస్థితి లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబును ఏనాడు విమర్శించలేదన్నారు. చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగా యని, వారికి సైతం తమ ప్రభుత్వం పరిహారం అందించినట్లు గుర్తు చేశారు.తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతును రాజును చేయడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాపత్రయపడుతున్నట్టు తెలిపారు.    

రాయితీపై వ్యవసాయ యంత్రాలు 
రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తున్నామని మంత్రి కాకాణి వివరించారు. వచ్చే నెలలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేతల మీదుగా ఒకే పర్యాయం రాయితీపై 3,500 ట్రాక్టర్లను అందిస్తామన్నారు. రైతులు ముందుగా పూర్తి మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం రాయితీ నగదును బ్యాంకులో జమ చేస్తుందన్నారు. వరికోత మిషన్లు కావాలని కొందరు రైతులు తనను కోరారని పరిశీలించి అందజేస్తామన్నారు. కోత మిషన్లకు రూ.8 లక్షల వరకు రాయితీ ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూక్ష్మ సేద్యం (డ్రిప్‌ఇరిగేషన్‌) రాయితీ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు.

సొసైటీలను సైతం ఆర్బీకేలకు అనుసంధానం చేసి రైతులు మండల కేంద్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులు అమ్ముకోలేకపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా తొలుత విరువూరు ఎస్సీ కాలనీ నుంచి బ్యారేజీ వరకు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాధికారి సుధాకర్‌రాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి తిరుపాల్‌రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ సుభానీ, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జ్‌ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, పొదలకూరు, ఏఎస్‌పేట జెడ్పీటీసీలు తెనాలి నిర్మలమ్మ, రాజేశ్వరమ్మ, విరువూరు మాజీ సర్పంచ్‌ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు జగన్‌మోహన్, వెంకయ్య, నాయకులు వళ్లూరు గోపాల్‌రెడ్డి, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, డీ రమణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top