చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి | Journalist Tilak files petition in High Court | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి

Apr 9 2026 4:55 AM | Updated on Apr 9 2026 4:55 AM

Journalist Tilak files petition in High Court

ఇందుకు ఏసీబీ కోర్టును ఆదేశించండి 

హైకోర్టులో పాత్రికేయుడు తిలక్‌ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన వేల కోట్ల రూపాయల భారీ నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్‌ కొట్టి బాలగంగాధర తిలక్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

తనను థర్డ్‌ పార్టీగా పేర్కొంటూ తాను కోరిన సర్టిఫైడ్‌ కాపీలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందని తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు.  మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఫైనల్‌ రిపోర్ట్, సీఆర్‌పీసీ 161 స్టేట్‌­మెంట్లు, క్లోజర్‌ రిపోర్ట్‌ తాలూకు సర్టిఫైడ్‌ కాపీ­లను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు.  

పిటిషన్‌లో ముఖ్యాంశాలు..  
చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులు వారికి అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, మద్యం నాణ్యత కూడా క్షీణించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది ప్రజా సేవకులు (పబ్లిక్‌ సర్వెంట్లు) ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 

ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు.. అది మొత్తం రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కాబట్టి, చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ను ప్రశ్నించే హక్కు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఆ ప్రకారమే, నాకు కూడా ఈ కేసును ప్రశ్నించే చట్టపరమైన హక్కు ఉంది. 

చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్‌ దాఖలు చేశా. ఈ పిల్‌ పెండింగ్‌లో ఉండగానే, మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. 

హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్‌లో తదుపరి విచారణ నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైనల్‌ రిపోర్ట్, సీఆర్‌పీసీ 161 స్టేట్‌మెంట్లు, క్లోజర్‌ రిపోర్ట్‌లు చాలా అవసరం. పిల్‌ దాఖలు చేసింది నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరాను. అయితే ఏసీబీ కోర్టు దీనికి నిరాకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement