
చంద్రబాబూ.. రాష్ట్రాన్ని కాదు, చిత్తూరును డెవలప్ చెయ్
చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన పార్టీ నేత ఆగ్రహం
చిత్తూరు అర్బన్: ‘‘ఎమ్మెల్యే చెప్పినా అంతే. చట్టం చట్టమే. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు’’ అంటూ చిత్తూరు కూటమి పార్టీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడుపై జనసేన నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిత్తూరులోని ఓ హోటల్లో శనివారం హై రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరులోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామన్నారు.
పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఇంతలో సభలో కూర్చున్న జనసేన నాయకుడు దయారాం నాయుడు మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? ఎమ్మెల్యే ఓ పొరంబోకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినపుడు హైరోడ్డు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. ఇప్పుడు కూడా ఆయన వద్ద్దకే వెళ్తాం. కూటమి ఉంటుందో, ఊడిపోతుందో తర్వాత కథ. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది. కొట్టండి నీవానది ఆక్రమణల్ని.
చంద్రబాబు అమెరికా, యూరప్ పోయి ఫండ్స్ తీసుకొస్తా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు. ముందు చిత్తూరు హై రోడ్డును అభివృద్ధి చేయండి. శ్మశానంలాగా తయారయ్యింది హై రోడ్డు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వం పనికిరాని భూములకు రూ.కోట్లలో పరిహారం ఇచ్చింది.
ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలియదా? ఎంతసేపు బిల్డింగ్ కొట్టేయండి, కొట్టేయండి అని ఎమ్మెల్యే అంటున్నారు. ఆయనకు పేరు వచ్చేయాలి. మరి మేము రోడ్డున పడాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని, టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు.