
జలాంతర్గాముల ఆనవాళ్లను పసిగట్టేలా సాంకేతికత
సాగర గర్భంలో సర్వే కోసం రెండు రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్
తూర్పు నౌకాదళం నుంచి సేవలందించనున్న నిస్తార్
జలప్రవేశం చేయించిన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరికరాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందూస్థాన్ షిప్‌యార్డు నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధనౌక భారత నౌకాదళ అమ్ముల పొదిలో శుక్రవారం చేరింది. విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సంజయ్ సేథ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్‌కుమార్ త్రిపాఠీ చేతుల మీదుగా నిస్తార్ యుద్ధనౌకని జాతికి అంకితం చేశారు.
అనంతరం.. సంజయ్ సేథ్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌లో ఇండియన్ నేవీ దూసుకుపోతోందని, నిస్తార్ యుద్ధనౌక మన దేశ ప్రతిష్టకి చిహ్నంగా మారిందన్నారు. ప్రస్తుతం భారత్‌లో అనేక యుద్ధనౌకలు తయారీలో ఉన్నాయని తెలిపారు. దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో ప్రస్తుతం పైప్‌లైన్‌లో ఉన్న 57 వార్‌షిప్స్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందుతున్నాయని వెల్లడించారు. రూ.50వేల కోట్ల రక్షణ రంగ ఎగుమతులు చేయడమే భారత్ ముందున్న లక్ష్యమన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంఎస్‌ఎంఈలకు సంపూర్ణ సహకారం అందుతోందని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని.. భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతికత మన రక్షణ రంగం సొంతమవుతుందని తెలిపారు. భారత్ పరాక్రమశక్తిని ఇటీవలే పాకిస్తాన్‌కి రుచి చూపించామని.. ఈ విషయంలో భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని కేంద్రమంత్రి సేథ్ వెల్లడించారు.
యుద్ధనౌకలకు మళ్లీ పునరుజ్జీవం..
ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్‌కుమార్ త్రిపాఠీ మాట్లాడుతూ.. భారత నౌకాదళం సేవల నుంచి నిష్క్రమించిన యుద్ధనౌకలు మళ్లీ పునరుజ్జీవం పొందుతున్నాయన్నారు. 1971 యుద్ధంలో పాక్ జలాంతర్గామి ఘాజీ నాశనమైనట్లు నిస్తార్ యుద్ధనౌక గుర్తించిందనీ.. దాని విజయానికి ప్రతీకగా నిస్తార్ క్లాస్ వార్‌షిప్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. డైవింగ్ సపోర్ట్, సబ్‌మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్‌ను సమానంగా నిర్వహించగల సత్తాతో నిస్తార్‌ని నిర్మించినట్లు వెల్లడించారు.
ఆత్మనిర్భర్ భారత్‌తో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్న వార్‌షిప్స్ సంఖ్య పెరుగుతోందనీ.. ఈ నౌకానిర్మాణంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. షిప్‌యార్డ్ సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రి మాట్లాడుతూ.. సుజాత యుద్ధనౌక నిర్మాణంలో కొరియన్ టెక్నాలజీ వినియోగించగా.. నిస్తార్ యుద్ధనౌక మాత్రం 80 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించామన్నారు.
నిస్తార్ స్వరూపమిది..
పొడవు: 119.7 మీటర్లు
బీమ్: 22.8 మీటర్లు
బరువు: 10,587 టన్నులు
వేగం: 18 నాటికల్ మైళ్లు
సిబ్బంది : 12 మంది అధికారులు, 113 మంది సెయిలర్స్
మొదటి కమాండింగ్ ఆఫీసర్ : కమాండర్ అమిత్ శుభ్రో బెనర్జీ నిర్మాణానికి పనిచేసిన ఎంఎస్‌ఎంఈలు : 120