
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
2016 తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్
విశాఖ కేంద్రంగా మరోసారి నిర్వహణకు సిద్ధం
145 దేశాలకు ఆహ్వానం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇండియన్ నేవీ
ఈసారి చైనాకు ఆహ్వానించే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ చర్చలు
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే మహోజ్వల ఘట్టానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారుతోంది. నీలి కెరటాల్లో నౌకదళ పరాక్రమాన్ని చాటిచెప్పే విన్యాసాలకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమివ్వబోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత.. విశాఖ నగరంలో యుద్ధ నౌకల పండుగగా పిలిచే.. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 నిర్వహించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది.
ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఆర్‌తో పాటు మిలాన్–2026 కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్‌ఆర్‌తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా దాదాపు 145 దేశాలకు ఆహ్వానాలు పంపించేందుకు సమాయత్తమవుతుండగా.. చైనాని పిలవాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. నౌకాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేలా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)కు విశాఖ మహా నగరం ఆహ్వానం పలకనుంది.
తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన పేరు చెప్తే వెంటనే విశాఖ గుర్తొచ్చే స్థాయికి ఎదిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్‌ని విజయవంతంగా నిర్వహించింది. అదేవిధంగా.. 2024 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాల్ని మరోసారి నిర్వహించింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్‌ఆర్‌కు ఆతిథ్యమిస్తోంది.
ఏమిటీ ఫ్లీట్ రివ్యూ
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల తన సత్తాను ప్రపంచదేశాలకు చాటిచూపించేవే ఫ్లీట్ రివ్యూలు. త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. మనదేశంలో 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్‌ఆర్‌ని నిర్వహించారు. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు విశాఖ వేదికగా నిలవబోతోంది.
చంద్రగుప్తుని కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి నేడు స్వయం శక్తితో అణుజలాంతర్గాములు నిర్మించే స్థాయికి చేరుకున్న భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూ ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో ప్రపంచదేశాలు మరోసారి విశాఖతీరంవైపు దృష్టిసారించనున్నాయి.
చైనాని పిలవాలా..వద్దా.?
ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో.. ఐఎఫ్‌ఆర్‌కు చైనాని ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్‌ఆర్‌కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఇప్పటి వరకూ భారత్‌లో జరిగే ఏ విన్యాసాలకు పాక్‌ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్‌ఆర్‌లో భాగస్వామ్యం కాబోతున్నాయి.
తొలిసారి 25..మూడోసారి 145
2001లో భారత్‌లో తొలిసారి ముంబైలో ఐఎఫ్‌ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్‌ఆర్‌లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి.
ఢిల్లీ క్లాస్, రాజ్‌పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్‌టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి.