నౌకా నిర్మాణంలో నవశకం | India focuses on building large ships: Indian Ship Technology Center launched in Visakhapatnam | Sakshi
Sakshi News home page

నౌకా నిర్మాణంలో నవశకం

Sep 21 2025 4:52 AM | Updated on Sep 21 2025 4:52 AM

India focuses on building large ships: Indian Ship Technology Center launched in Visakhapatnam

భారీ నౌకల నిర్మాణంపై దృష్టి సారించిన భారత్‌  

రెండు మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు 

అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో..  

విశాఖలో ఇండియన్‌ షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం  

నౌకా నిర్మాణ మార్కెట్‌లో వాటా పెంచుకోవడంపై భారత్‌ గురి  

రక్షణ ఉత్పత్తులు, త్రివిధ దళాల పాటవాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్‌.. నౌకా నిర్మాణం విషయంలో మాత్రం ఇప్పటివరకు వెనుకబడే ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏటా ఈ రంగంలో దూసుకుపోతుంటే.. ఇన్నాళ్లూ నెమ్మదిగా నెట్టుకొచి్చన భారత్‌ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్లు, ఇండియన్‌ షిప్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతో భారత నౌకా నిర్మాణ రంగ దశ, దిశ మారబోతోంది. భారీ కార్గో నౌకల తయారీ కోసం అగ్రదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి.. ఇకపై 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను తయారుచేసే శక్తిగా భారత్‌ అవతరించబోతోంది. దేశ తూర్పు, పశ్చిమ తీరాలకు మణిహారాల్లా ఈ మెగా షిప్‌ బిల్డింగ్‌ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్‌లో ప్రస్తుతం భారత్‌ వాటా కేవలం 0.06 శాతం మాత్రమే. చైనా, దక్షిణ కొరియా, జపాన్‌ వంటి దేశాలు 85 శాతం వాటాతో షిప్‌ బిల్డింగ్‌ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మన దేశ తీరానికి వచ్చే భారీ నౌకలకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే, వాటిని బాగుచేసే అత్యాధునిక షిప్‌యార్డులు లేకపోవడం ఒక ప్రధాన లోటుగా కేంద్రం భావించింది. ఈ ఏడాది జూలైలో అరేబియా సముద్రంలో ‘ఎంవీ మెర్క్స్‌ ఫ్రాంక్‌ఫర్ట్‌’అనే భారీ కార్గో షిప్‌ అగి్నప్రమాదానికి గురైనప్పుడు.. దానికి అవసరమైన మరమ్మతు సౌకర్యాలు భారత్‌లో లేకపోవడంతో మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

ఈ నేపథ్యంలో దేశంలోని రెండు ప్రాంతాల్లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్లను ఏర్పాటు చే­సేందుకు సిద్ధమవుతోంది. తూర్పు, పశి్చమ తీరా­ల్లో చెరొకటి చొప్పున ఈ క్లస్టర్లను 2030 నాటికి పూ­ర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భా­గంగా ప్రధాని మోదీ సమక్షంలో భావనగర్‌లో జరిగిన కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు, ఏపీ ప్రభు­త్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఏపీ­లో ఈ మెగా క్లస్టర్‌ను శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మెగా క్లస్టర్లను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయనుండగా.. కేంద్ర ప్రభుత్వమే రోడ్లు, భూమి అభివృద్ధి, విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది.   

నౌకల నిర్మాణం భారత్‌లో మొదలైనా..  
సింధులోయ నాగరికత కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నౌకల నిర్మాణాన్ని భారత్‌ ప్రారంభించింది. గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ చెక్క నౌకలను నిర్మించేవారు. మధ్యయుగంలో భారతీయ నౌకా నిర్మాణదారులు తయారు చేసిన నౌకలకు మంచి గిరాకీ ఉండేది. అయినప్పటికీ ఆధునిక షిప్‌బిల్డింగ్‌లో మనం వెనుకబడ్డాం.

ప్రస్తుతం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కార్యక్రమాల కింద ఉపాధి, ఎగుమతులు, దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా నౌకా నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మన నావికా దళాన్ని ఆధునీకరించడంలో భాగంగా విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలను నిర్మించడంలో ఈ షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్లు కొత్త ఒరవడిని సృష్టించనున్నాయి.   

విశాఖలో ఇండియన్‌ షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ 
విశాఖలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ ఆవరణలో సాగరమాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియన్‌ షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ను(ఐఎస్‌టీసీ) ప్రధాని మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. మారిటైమ్‌ విజన్‌–­2030లో భాగంగా నెలకొల్పిన ఈ కేంద్రం.. మారిటైమ్‌ టెక్నాలజీకి జాతీయ హబ్‌గా మారనుంది. ఇక్కడ నౌకా నిర్మాణ అభివృద్ధిపై పరిశోధనలు, స్వదేశీ నౌకల రూపకల్పన, డిజిటల్‌ ఆవిష్కరణలు జరగనున్నాయి. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ షిప్‌యార్డులకు అనుసంధానంగా పనిచేస్తూ, భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడే నేషనల్‌ షిప్‌ డిజైన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను కూడా పునరుద్ధరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.

విస్తరణకు భారీ అవకాశాలు 
భారత నౌకానిర్మాణ పరిశ్రమ ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక విస్తరణ, జాతీయ భద్రతకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. దేశంలో 200 కంటే ఎక్కువ చిన్న ఓడరేవులు, 12 ప్రధాన పోర్టులు, 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం స్వదేశీ నౌకానిర్మాణాన్ని ప్రోత్సహించడానికి బలమైన పునాదిగా ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్‌లో మన దేశ వాటా 1శాతం కంటే తక్కువగా ఉంది.

ఈ వాటా దక్షిణ కొరియా (25శాతం), జపాన్‌ (18శాతం), చైనా (47శాతం) కంటే చాలా తక్కువ. ఆ దేశాలు బలమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణ వ్యవస్థలను స్థాపించగా, భారత్‌ ఇప్పుడు ఆ దిశగా పయనిస్తోంది. 2024లో ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్‌ విలువ 150.42 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేయగా, ఇది 2033 నాటికి 203.76 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అనుగుణంగా నౌకలకు డిమాండ్‌ పెరగనుండటంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్‌ సిద్ధమైంది.

భారీ నౌకల తయారీ సులభతరం
దేశంలో ప్రస్తుతం ఉన్న కొచి్చన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్, గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్, హిందూస్తాన్‌ షిప్‌యార్డ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ఎల్‌ అండ్‌టీ, రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వంటి ప్రైవేట్‌ షిప్‌యార్డులకు ఈ కొత్త మెగా షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్ల ద్వారా విస్తృతమైన అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం గరిష్టంగా 1.25 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను మాత్రమే నిరి్మస్తున్న భారత్‌.. ఈ క్లస్టర్లు పూర్తయితే ఏకంగా 3 మిలియన్‌ టన్నుల వరకు కార్గో సామర్థ్యంతో అతిపెద్ద నౌకలను నిర్మించగలుగుతుంది. అదేవిధంగా భారీ యుద్ధనౌకలు, ప్రత్యేక నౌకల నిర్మాణం కూడా ఈ మెగా క్లస్టర్లలో జరగనుంది. దేశంలో విస్తరిస్తున్న చమురు, గ్యాస్‌ నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రెడ్జర్లు, ఆఫ్‌షోర్‌ సపోర్ట్‌ షిప్‌లకు పెరుగుతున్న గిరాకీని కూడా ఈ కేంద్రాలు తీర్చనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement