
లీజు ముగిసినా బేఖాతర్.. నిబంధనలకు విరుద్ధంగా ‘సైదాపురం’ రివిజన్
పునరుద్ధరణ దరఖాస్తులను తిరస్కరించిన ఆ శాఖ సెక్రటరీ
అయినా మంత్రి కార్యాలయంలో రివిజన్‌కు ఓకే.. ఈ డీల్ వెనుక భారీగా చేతులు మారిన వైనం
సాక్షి టాస్స్‌పోర్స్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలో గడువు ముగిసిన గనుల లీజు పునరుద్ధరణ ద్రస్తాలు చకచకా కదులుతున్నాయి. వాస్తవానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) పరిధిలో ఉండే మైన్స్ శాఖ లీజు పునరుద్ధరణ చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కార్యాలయం రివిజన్‌కు ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు సైదాపురంలో లీజు ముగిసిన గనులను చేజిక్కించుకొని పునరుద్ధరణ కోసం మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్నారు. రూ.కోట్ల ముడుపులు ముట్టజెప్పి లీజుల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు యత్నిస్తున్నారు.
జరిగేది ఇలా..
సైదాపురం మండలంలోని తూర్పు రొండ్ల రెవెన్యూలోని సర్వే నంబర్లు 551, 553, 554.. మొలకల పూండ్లలో సర్వే నంబర్ 815 నుంచి 825లో 19,927 హెక్టార్ల విస్తీర్ణంలో క్వార్ట్జ్, పల్‌స్పర్, మైకా ఖనిజాలు తవ్వుకునేందుకు 1972లో 20 ఏళ్ల పాటు శోభారాణి పేరుతో లీజు కేటాయించారు. ఆపై మరో 30 ఏళ్లు లీజును పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు పూర్తయింది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన గనుల లీజును పునరుద్ధరించరు. మేజర్ మినరల్ క్వార్ట్జ్ మైన్స్ కావడంతో లీజు పునరుద్ధరణ ఐబీఎం పరిధిలోకి వెళ్తుంది.
తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతల దృష్టి గడువు ముగిసిన గనులపై పడింది. శోభారాణి క్వార్ట్జ్ గనిని తీసుకొని వెంటనే మైనింగ్ కమిషనర్‌కు లీజు పునరుద్ధరణ కోసం దరఖాస్తు పంపారు. వాస్తవంగా ఈ క్వార్ట్జ్ గని లీజు 2023 ఆగస్టులో ముగిసింది. వెంటనే నెల వ్యవధిలో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతేడాది జూన్‌లో స్థానిక మైనింగ్ అధికారులను మేనేజ్ చేసుకొని దరఖాస్తు పంపారు. అయితే 11 నెలల తర్వాత లీజు కోసం దరఖాస్తు రావడంతో గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తిరస్కరించారు.
శోభారాణి గనిపై రూ.32.11 కోట్ల పెనాల్టీ
శోభారాణి పేరుతో ఉన్న గనిలో గతంలో లీజు గడువు ముగిసినా అక్రమంగా క్వార్ట్జ్ మెటల్ తవ్వి విక్రయాలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలోనే మైనింగ్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా తవ్వేసిన క్వార్ట్జ్ మెటల్‌ను లెక్కించి రూ.32.11 కోట్ల పెనాల్టీ వేశారు. ఈ మేరకు డిమాండ్ నోటీసును ఇచ్చారు. పెనాల్టీ ని ఇంకా చెల్లించలేదు.
పాత తేదీలతో ద్రస్తాలు కదిలించి
గనుల శాఖ కార్యాలయానికి ఆ గని లీజు కోసం మంత్రి రివిజన్‌కు ఆహా్వనించాలని ఆదేశాలొచ్చాయి. వెంటనే నెల్లూరు గనులు, భూగర్భ శాఖ కార్యాలయం నుంచి ఆగమేఘాలపై పాత తేదీలతో ద్రస్తాలను కదిలించారు. మంత్రి కార్యాలయంలో రివిజన్‌కు ఆహ్వానించడం వరకు ఫైలు చకచకా కదిలింది. ఈ డీల్ వెనుక రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.
ఇదే బాటలో మరో నాలుగు
చాగణంలోని భారత్ సిద్ధి వినాయక మైన్స్‌కు లీజు గడువు పూర్తయింది. ఆయా గనుల్లో అక్రమంగా వ్యాపారం జరిగిందని మైనింగ్ అధికారులు దాడులు చేసి పెనాల్టీ లు విధించారు. ఈ మైన్స్ లీజుల పునరుద్ధరణ పనిలో కూటమి నేతలు పడ్డారు. నిబంధలకు విరుద్ధంగా లీజు పునరుద్ధరణ కోసం మంత్రి రివిజన్‌కు ఫైళ్లు పంపారని తెలుస్తోంది.
ఐబీఎం పరిధిలో ఉన్నా..
ప్రస్తుతం చిన్న తరహా ఖనిజాల జాబితాలో ఉన్న బెరైటీస్, క్వారట్జ్, పల్స్‌పర్, మైకా ప్రధాన ఖనిజాలను సైతం మేజర్ మినరల్స్ జాబితాలోకి చేరుస్తూ కేంద్రం గెజిట్ ప్రచురించింది. గతంలో ఇవి ప్రధాన ఖనిజాల జాబితాలోనే ఉండేవి. 2015లో మైనర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి రాష్ట్ర ప్రభుత్వం లీజులు మంజూరు చేసేది. తాజాగా ఇక నుంచి లీజుల కేటాయింపు ఐబీఎం పరిధిలో చేర్చి అనుమతులు ఇచ్చేలా గెజిట్‌ను ప్రచురించారు. ప్రస్తుతం సైదాపురం గనులన్నీ ఐబీఎం పరిధిలో ఉంటాయి. ఇకపై లీజులకు అనుమతులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇవ్వాల్సి ఉంది. గడువు పూర్తయిన వాటిని వేలం ద్వారా కేటాయిస్తారు.
ఎన్జీటీలో కేసులు ఉన్నా..
సైదాపురం గనుల వ్యవహారమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులు నడుస్తున్నాయి. అక్కడ గనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలివ్వడంతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయించారు. నెల్లూరు ఆర్డీఓ, పొల్యూషన్ బోర్డు ఈఈ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అక్రమంగా నడుస్తున్నాయంటూ నివేదిక ఇచ్చారని సమాచారం. అయినా మైనింగ్ అధికారులు ఈ గనులకు మంత్రి కార్యాలయానికి రివిజన్ పంపడం చర్చనీయాంశమైంది. 1956 ఎంఎం డీఆర్ యాక్ట్ ప్రకారం మేజర్ మినరల్ 50 ఏళ్లయితే ప్రభుత్వం వేలం ద్వారా లీజులు కేటాయించాలి. ఈ గనులపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలుస్తోంది.