నీ వెంటే నేనూ..!

భార్య మృతి తట్టుకోలేక గంట వ్యవధిలోనే భర్త మరణం
మంగళగిరి: మృత్యువులోనూ ఆ దంపతులు తమ బంధాన్ని వీడలేదు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందిన దుర్ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85), రాఘవమ్మ (69) ముప్పై ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం యర్రబాలెంకి వలస వచ్చారు.
కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుని ఇద్దరి కుమార్తెల వివాహాలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలి బుధవారం మృతి చెందింది. తన భార్య మృతిని తట్టుకోలేక వృద్ధుడు వీర్రాజు కూడా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించగా మధ్యలోనే మృతి చెందాడు. వీర్రాజు, రాఘవమ్మ ఆఖరి నిమిషం వరకూ కూడా ఎవరి పనులు వారే చేసుకునే వారని స్థానికులు తెలిపారు.