ఏయూపై టీడీపీ ఎంపీ పెత్తనమా! | High-handed behaviour of tdp leaders in Andhra University | Sakshi
Sakshi News home page

ఏయూపై టీడీపీ ఎంపీ పెత్తనమా!

Apr 27 2026 5:38 AM | Updated on Apr 27 2026 5:38 AM

High-handed behaviour of tdp leaders in Andhra University

ఏయూ లోగో, మొదటి వీసీ కట్టమంచిని స్మరించుకుంటున్న మేధావులు

ఏయూని గీతం ప్రైవేట్‌ వర్సిటీ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ భరత్‌ ఎలా సమీక్షిస్తారు? 

వర్సిటీలో చదువుకున్న మేధావుల్ని గుర్తించకుండా శతాబ్ది ఉత్సవాలేంటి?  

జడ్జిలు, ఉన్నత పదవుల్లో ఉన్న వారిని ఉత్సవాల్లో విస్మరించడం బాధాకరం 

భూములు ఇచ్చిన దాతల్ని కూడా పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గం 

అంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్ర సదస్సులో మేధావుల పెదవి విరుపు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూములిచ్చిన దాతల్ని శతాబ్ది ఉత్సవాల్లో విస్మరించడం దుర్మార్గమని మేధావుల వర్గం, ఏయూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల విద్యా ప్రదాయిని, చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ‘ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తు బాధ్యత’ పేరుతో విశాఖలో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. వర్సిటీలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేధావులను విస్మరించి, చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా ఉత్సవాలు నిర్వహించడం వారి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.\

గీతం ప్రైవేట్‌ వర్సిటీ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ భరత్‌  ఏయూని ఎలా సమీక్షిస్తారని నిలదీశారు. వర్సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాంధ్ర మేధావులను, న్యాయమూర్తులను, ఉన్నతాధికారులను ఆహ్వనించకపోవడం వారిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణలో వర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ముక్తకంఠంతో తప్పుబట్టారు.  

ఏయూ ప్రతిష్టను దిగజార్చి.. ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలని కుట్ర  
ఈ సదస్సులో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్‌ మాట్లాడుతూ.. గీతం ప్రైవేట్‌ వర్సిటీ అధ్యక్షుడు భరత్‌ ఏయూ ఉత్సవాలను సమీక్షించడం దారుణమని మండిపడ్డారు. ఇది వందేళ్ల ఏయూ ప్రతిష్టను దిగజార్చి, ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలనే కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. వర్సిటీ అభివృద్ధి ఈ ప్రాంత ప్రగతికి తోడ్పడాలే తప్ప, బయటి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం కాదని యూపీఎస్‌సీ పూర్వ మెంబర్‌ ప్రొ.కేఎస్‌ చలం పెదవి విరిచారు. వర్సిటీ ఏర్పాటుకు వందల ఎకరాలు ఇచ్చిన వారి కుటుంబాలకూ ఆహ్వనం లేకపోవడం అత్యంత హేయమని తెలిపారు.

ఏయూ నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, జడ్జిలు రాజ్యాంగపరమైన పదవులు చేపట్టిన వారిని కూడా చంద్రబాబు ప్రభుత్వం, ఏయూ అధికారులు గుర్తించలేదని నన్నయ యూనివర్సిటీ పూర్వ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ.ముత్యాలనాయుడు దుయ్యబట్టారు. వందేళ్ల వర్సిటీ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన తరుణంలో ఉత్సవాల్ని పేలవంగా నిర్వహించడం టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. డా.అంబేడ్కర్‌ వర్సిటీ పూర్వ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ.నిమ్మ వెంకటరావుతో పాటు కళింగసీమ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement