ఏడాదైనా కౌంటర్‌ దాఖలు చేయరా? | High Court orders Chandrababu Naidu government On land irregularities | Sakshi
Sakshi News home page

ఏడాదైనా కౌంటర్‌ దాఖలు చేయరా?

Oct 8 2026 4:28 AM | Updated on Oct 8 2026 4:28 AM

High Court orders Chandrababu Naidu government On land irregularities

కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ 4,731 ఎకరాల భూ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు 

మిగిలిన ప్రతివాదులందరూ కౌంటర్‌ దాఖలు చేస్తే మీకేమయ్యింది? 

నిర్లక్ష్యానికి రూ.7 వేలు ఖర్చులు చెల్లించండి 

తదుపరి విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేయాల్సిందే..   

బాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

కేఐపీఎల్‌ ఈనాడు యజమానికి సమీప బంధువు సంస్థ  

అందువల్లే చంద్రబాబు ప్రభుత్వం కేఐపీఎల్‌పై  స్పందించడంలేదని విమర్శలు

సాక్షి, అమరావతి: రోజూ జనాలకు సుద్దులు చెబుతూ కథనాలు వండివార్చే ఈనాడు దినపత్రిక యజమాని కిరణ్‌ సమీప బంధువుకు చెందిన కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐపీఎల్‌) భూ అక్రమాలకు సంబంధించిన వ్యాజ్యంలో ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మిగిలిన ప్రతివాదులందరూ కౌంటర్‌ దాఖలు చేయగా, ప్రభుత్వం ఒక్కటే కౌంటర్‌ దాఖలు చేయలేదని, కౌంటర్‌ దాఖలుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీసింది. ఏడాదిగా కౌంటర్‌ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేలు ఖర్చులు విధించింది. 

ఈ మొత్తాన్ని కౌంటర్‌ దాఖలులో అలసత్వం ప్రదర్శించిన అధికారి జేబు నుంచి వసూలు చేసి, దాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అప్పీళ్లతో పాటు ఇతర వ్యాజ్యాలు ఏవైనా ఉంటే, వాటన్నింటినీ ఈ పిల్‌కు జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సెజ్‌ కోసం రైతుల నుంచి తీసి ఇచ్చిన భూములను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి తెలియకుండానే కేఐపీఎల్‌ అమ్మేసుకుంటున్నా బాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ, ప్రతిపక్షంపై బురదజల్లుతూ అన్ని రకాలుగా ఈనాడు పత్రిక సహకరిస్తుండటంతో బాబు సర్కార్‌ చోద్యం చూస్తోంది.  బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎంపీఎస్‌ఈజెడ్‌) ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్, ఆ భూముల్లో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేయకుండా ఆ భూములను థర్డ్‌ పార్టీ కంపెనీలకు అమ్మేసుకోవడం, ఏపీఐఐసీకి తెలియకుండా రుణాలు తీసుకుంటున్నా ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలుకు బాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది.  

సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్‌ 
ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్‌  అక్కడ ఎలాంటి సెజ్‌ ఏర్పాటు చేయలేదని, దీని పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, గూడూరుకు చెందిన నాను మునీంద్రరెడ్డి 2025 సెప్టెంబర్ లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన అప్పటి సీజే ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, కేఐపీఎల్‌ తదితరులకు కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.  

భూ కేటాయింపులే పెద్ద మోసం 
కేఐపీఎల్‌కు భూ కేటాయింపులు భారీ మోసం.  ఇంతకు మించిన మోసం దేశంలో ఎక్కడా జరగలేదు. బహుళ ఉత్పత్తుల ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి, రైతులకు చెందిన 4,731 ఎకరాల భూమిని పొందిన కేఐపీఎల్‌ ఇప్పటి వరకు అక్కడ ఏమీ చేయలేదు.  చిన్నపాటి రోడ్డూ వేయలేదు. ఈ 17 ఏళ్లలో చిన్న నిర్మాణం కూడా చేయలేదు.  

భూములు అమ్మేసుకుంటోంది 
ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేయాల్సింది పోయి, తీసుకున్న భూములను ఇతరులకు అమ్ముకుంటోంది.  అంతేకాక కొన్ని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇలా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకుంది.  

ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం 
ఎస్‌ఈజెడ్‌ పేరుతో తీసుకున్న భూముల్లో రూ.30 వేల కోట్ల విలువ చేసే సిలికా శాండ్‌ ఉంది.  దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,500 కోట్లు రాయల్టీ వస్తుంది. కేటాయించిన భూముల్లో కేఐపీఎల్‌ ఏమీ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆదాయాన్ని కూడా కోల్పోతోంది.      

రూ.1,500 కోట్ల పన్ను మినహాయింపు 
కేఐపీఎల్‌ ఇన్ని అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. పైపెచ్చు ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల మేర పన్ను మినహాయింపులు ఇచ్చింది. మోసాల్లోకెల్లా ఇది అతిపెద్ద మోసం. ఇంత జరుగుతున్నా  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. –  సీనియర్‌ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement