రాష్ట్రమంతా వానలే.. వానలు

Heavy Rain Forecast For Andhra Pradesh - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా పరిసరాల్లో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది ఏర్పడినట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో శనివారం సగటున 14.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 67.2 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 37.6, పార్వతీపురం మన్యంలో 31.4, అల్లూరి సీతారామరాజు 34, విశాఖ జిల్లాలో 32.5, అనకాపల్లి జిల్లాలో 21.7, కాకినాడ జిల్లాలో 13.4, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 12.5, తూర్పుగోదావరి 20.9, పశ్చిమగోదావరి జిల్లాలో 17.1, ఏలూరు జిల్లాలో 15.4, కృష్ణాలో 19.8, ఎన్టీఆర్‌ జిల్లాలో 26.4, గుంటూరు జిల్లాలో 15, పల్నాడు జిల్లాలో 16.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 222 మిల్లీమీటర్ల (22 సెంటీమీటర్లు) వర్షం పడింది. గరివిడిలో 170.6, చీపురుపల్లిలో 123.6, శ్రీకాకుళం జిల్లా లావేరులో 123.2, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 122.6, తెర్లాంలో 102.6, గజపతినగరంలో 99.6, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 120.1, రణస్థలంలో 113.2, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 98.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. కాగా గుంటూరు జిల్లావ్యాప్తంగా గత మూడు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది వర్షాలను సైతం లెక్కచేయకుండా వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా మొత్తం మీద సగటున 4.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 

గోడ కూలి ఇద్దరు దుర్మరణం.. 
విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో పెంకుటిల్లు గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డాల రాము పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య సాయి ధరణి, పిల్లలు హర్షిత్‌వర్మ, భవానీ, తల్లి లక్ష్మితో కలిసి శుక్రవారం రాత్రి భోజనం చేశాక నిద్రలోకి జారుకున్నారు. భారీ వర్షానికి తడిసిపోయిన ఇంటి గోడ శనివారం వేకువజామున వీరిపై ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో గోడపక్క నిద్రపోయిన లక్ష్మి (57), మనుమడు హర్షిత్‌వర్మ (5) దుర్మరణం చెందారు. మిగిలిన ముగ్గురు గాయపడ్డారు. వీరిని వైద్యసేవల కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. 

పశ్చిమ ఏజెన్సీలో కొండ వాగుల ఉధృతి..
పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గుబ్బల మంగమ్మ గుడి దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో ముందుజాగ్రత్త చర్యగా 1800 233 1077 నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద 1.5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. 

గోదావరిలో నిలిచిన పర్యాటకం
గోదావరికి వరద నీరు రావడంతో అధికారులు పర్యాటక బోట్లను నిలిపివేశారు. ఇప్పటికే తుపాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజుల నుంచి గోదావరికి వరద నీరు పెరగడంతో పర్యాటక బోట్లను నిలిపివేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 28.8 మీటర్ల మేర నీటిమట్టం ఉంది.

అత్యవసర సాయం కోసం కంట్రోల్‌ రూములు..                                                                     
భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 18004250101, 08632377118 నంబర్లను సంప్రదించాలన్నారు. 

నదులు జలజల..
ఎడతెరిపిలేని వానలతో వాగులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ నీళ్లన్నీ చేరుతుండటంతో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకున్నాయి. తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేస్తామని, అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలుకానుంది.

మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వానలు పడుతుండటంతో అందులోనూ ప్రవాహాలు పెరిగాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి,శబరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజ్‌ వద్ద క్రమేపీ నీటి ఉధృతి పెరుగుతూ వచ్చింది. దీంతో బ్యారేజ్‌ నుంచి శనివారం సాయంత్రం 2,21,502 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌ వద్ద 8 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 20.60 అడుగులు, కూనవరంలో 9.75 మీటర్లు, కుంటలో 4.71 మీటర్లు, పోలవరంలో 7.27 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్‌ వద్ద 13.19 మీటర్ల నీటిమట్టం ఉంది. కాగా కృష్ణానదికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో 14,700 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.

ఇరిగేషన్‌ అధికారులు 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,700 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శనివారం అర్ధరాత్రి సమయానికి ప్రకాశం బ్యారేజ్‌కు వాగు వంకల నుంచి 40 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. దీంతో కృష్ణానది దిగువ ప్రాంతాల్లో లంక భూముల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఏవైనా సాయం కావాల్సి వస్తే డిస్ట్రిక్ట్‌ 0863–2234014 నంబర్‌కు ఫోన్‌ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి తెలిపారు. మరోవైపు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్‌ జిల్లాలోని కట్టలేరు, మున్నేరు, వైరా పొంగిపొర్లుతున్నాయి. కట్టలేరుకు వరద రావడంతో వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దామూలూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top