తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన అమ్మాయిలు

Gummagutta Five Sisters Loss Her Parents Waiting For Donation - Sakshi

తల్లిదండ్రులు దూరమయ్యారు దీనావస్థలో ఐదుగురు కుమార్తెలు

భారమైన కుటుంబ పోషణ

చదువు మాని కూలి పనులకు

దాతల కోసం ఎదురుచూపు 

అమ్మ అనురాగం, నాన్న మమకారం దూరమయ్యాయి. జీవనాధారం లేదు.. జీవితాలకు వెలుగూ లేదు. నా అన్న వాళ్లు లేరు. కష్టమొచ్చినా కన్నీరు రాల్చడం తప్ప..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బతుకు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నారు. దయనీయ జీవితాలకు దర్పణంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు.

గుమ్మఘట్ట (అనంతపురము): మండలంలోని గొల్లపల్లి ఎస్సీ కాలనీలో పీజీ హంపన్న, సాకమ్మ దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి శశికళ, తిప్పక్క, రాధ, లక్ష్మి, శైలజ సంతానం. పెద్దమ్మాయి శశికళకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లి సాకమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. పెద్దమ్మాయి సాయంతో మిగిలిన నలుగురు ఆడపిల్లల ఆలనాపాలనను తండ్రి చూసుకుంటూ వచ్చాడు. కూతుళ్లు మంచి ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించాడు. పెద్దమ్మాయి (ఐదో తరగతి) మినహా మిగిలిన నలుగురూ చదువులో ముందుకెళ్లారు. రెండో అమ్మాయి తిప్పక్క బీటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌) పూర్తి చేసింది. మూడో అమ్మాయి రాధ డిప్లొమా కోర్సులో చేరి డ్రాపౌట్‌ అయ్యింది. నాల్గో అమ్మాయి లక్ష్మి ఇంటర్‌ పూర్తి చేసింది. ఐదో అమ్మాయి శైలజ డిగ్రీ ఫస్టియర్‌ చదివి ఆపేసింది. కాగా వీరి జీవితంలో మరొకసారి కుదుపు వచ్చింది. తండ్రి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.

ఒక్కరైనా బాగా చదవాలని... 
తండ్రి అనారోగ్యం నేపథ్యంలో నలుగురు అక్కాచెల్లెళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. తిప్పక్క బీటెక్‌  కోర్సు పూర్తి చేసేలా, అందుకు అవసరమైన ఖర్చుల కోసం కూలి బాట పట్టారు. ఇంతలోనే ఈ ఏడాది మే నెలలో తండ్రికి తీవ్ర జ్వరం, జలుబు, చలి లాంటి లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఇన్నాళ్లూ అండగా నిలిచిన తండ్రి కూడా దూరం కావడంతో అమ్మాయిలకు కష్టాలు రెట్టింపయ్యాయి. చౌకదుకాణం ద్వారా వచ్చే రేషన్‌ సరుకులతో పాటు కూలి పనుల ద్వారా వచ్చే సంపాదనతో బతుకు నెట్టుకొస్తున్నారు.

ఆర్థికసాయం చేయాలనుకునే వారు.. 
పేరు : పి.జి.జి.తిప్పక్క 
అకౌంట్‌ నంబర్‌ : 520101212861618 
యూనియన్‌ బ్యాంకు, రాయదుర్గం బ్రాంచ్‌ 
ఐఎఫ్‌ఎస్‌సీ : యూబీఐఎన్‌ 0900362

ఉద్యోగం ఇప్పించండి 
బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసి ఇంటికే పరిమితమయ్యాను. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారు. అమ్మానాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మా యోగక్షేమాలు చూసుకునేవారు ఎవరూ లేరు. ఏ కష్టం వచ్చినా మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ బతుకుతున్నాం. దయార్ద్ర హృదయులు  స్పందిస్తే మా బతుకులు బాగుపడతాయి.  
- తిప్పక్క

విధిలేక కూలి పనులకు.. 
బ్రహ్మసముద్రం గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశా. అనంతపురంలో డిప్లొమా కోర్సులో చేరా. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశా. సర్టిఫికెట్లు ఇవ్వమంటే డబ్బు చెల్లించలేదని కళాశాల వారు నిరాకరించారు. వాటిని అక్కడే వదిలేసి విధిలేక కూలి పనులకు వెళ్తున్నా. - రాధ, డిప్లొమా విద్యార్థిని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top