
మహిళల కోసం వర్క్ ఫ్రం హోం విధానం
అనకాపల్లి ఎలీప్ ప్రాజెక్టుతో 10,000 మందికి ఉపాధి లభిస్తుంది: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడంతో పాటు యూనిట్ల ఏర్పాటులో 45శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రూ.14,000 కోట్ల రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అదే విధంగా ఇంటి వద్ద ఖాళీ సమయంలో పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ విధానం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఎలీప్ నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ 50 శాతం మంది మహిళలు పనిచేస్తేనే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు.
ఇందుకోసమే ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త నినాదం తీసుకున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుసంధానంగా ఐదు రీజనల్ హబ్‌లు ఉంటాయని, ఒక ఆలోచనతో వస్తే దాన్ని ఏ విధంగా పారిశ్రామీకరణ చేయాలో ప్రభుత్వం దగ్గరుండి చేయిపట్టి అడుగులు వేయిస్తుందన్నారు.
అనకాపల్లి జిల్లా, కోడూరు వద్ద 31 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎలీప్ మహిళా పారిశ్రామిక పార్కు ద్వారా 200 యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకొని అడుగుముందుకేసే వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.