ఉద్యమం ఉధృతమే.. | Govt Teachers Protest Against Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఉద్యమం ఉధృతమే..

Apr 27 2026 5:45 AM | Updated on Apr 27 2026 5:45 AM

Govt Teachers Protest Against Chandrababu Govt

విజయవాడలోని ధర్నాచౌక్‌లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం: ఫ్యాప్టో ఆగ్రహం

తక్షణమే 12వ పీఆర్సీని నియమించాలని డిమాండ్‌ 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి..

పెండింగ్‌ డీఏలు, సరెండర్‌ లీవు బకాయిలు చెల్లించాలి 

ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి 

స్థానిక సంస్థల పాఠశాలల్లో కారుణ్య నియామకాలు చేపట్టండి 

హైస్కూల్ ప్లస్‌లను బలోపేతం చేయాలి

విజయవాడలో రెండో రోజూ కొనసాగిన నిరాహార దీక్షలు 

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) హెచ్చరించింది. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రాధాన్యత జాబితాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేరని, అందువల్లే సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇక ఉపేక్షించబోమని స్పష్టంచేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా విజయవాడ  ధర్నాచౌక్‌లో చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజూ కొనసాగాయి. రెండో రోజు దీక్షలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్‌.చిరంజీవి తదితర నాయకులు మాట్లాడారు. ‘12వ వేతన సవరణ సంఘం(పీఆర్సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలి. పీఆర్సీ నిర్ణయాలు అమల్లోకి వచ్చే వరకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇవ్వాలి. స్థానిక సంస్థల పాఠశాలల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలి. హైస్కూల్‌ ప్లస్‌లను బలోపేతం చేయాలి. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలి. సరెండర్‌ లీవు బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఫ్యాప్టో కోరుతున్న న్యాయమైన 17 డిమాండ్లను పరిష్కరించాలి’ అని నాయకులు డిమాండ్‌ చేశారు.  

ఎంతవరకైనా పోరాటం చేస్తాం
‘పంచాయతీరాజ్‌ యాజమాన్యంలోని స్కూ­ళ్ల­లో ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దాని అమలు కోసం జీవో నంబర్లు 72, 73, 74 విడుదల చేశారు. ఈ జీవోలపై కోర్టు అభ్యంతరాలు కూ­డా లేవు. అయినా అమలు చేయడం లేదు. స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాద్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను చేపట్టకపోవడం దారుణం.

ఏకీకృత సర్వీస్‌ రూల్స్, కారుణ్య నియామకాల సాధన కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తాం’ అని ఫ్యాప్టో నాయకులు స్పష్టంచేశారు. ఫ్యాప్టో నిరాహార దీక్షకు ప్రైవేట్‌ స్కూల్స్, లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు డి.ప్రసన్న సంఘీభావం తెలిపారు. ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్లు కె.నరహరి, కాకి ప్రకాష్ రావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్‌లు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.బసవ లింగారావు, కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ మంజుల, జి.హృదయరాజు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement