
మంగళవారం మరో రూ.5 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం
బడ్జెట్ లోపల, బయట చంద్రబాబు సర్కారు అప్పులు రూ.1,91,112 కోట్లు
ఇందులో బడ్జెట్ లోపల రూ.1,28,702 కోట్లు.. బయట రూ.62,410 కోట్లు
14 నెలల్లోనే ప్రజలపై భారీ రుణభారం మోపిన కూటమి ప్రభుత్వం
ఇన్ని అప్పులు చేసినా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనకడుగు అప్పు చేయకుండా సంపద
సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు
ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పరిపాలన
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా రుణాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. వారం వారం అప్పులు చేస్తూ కేవలం 14 నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులకు చేరువయ్యారు.
సంపద సృష్టి సంగతి పక్కనపెడితే సూపర్ సిక్స్ హామీల అమల్లోనూ వెనకబడిన చంద్రబాబు సర్కారు... బడ్జెట్ లోపల–బయట అప్పులు చేయడంలో మాత్రం వేగంగా దూసుకుపోతోంది. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ 6.96 శాతం వడ్డీకి రూ.5 వేల కోట్లు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీటితో కలుపుకొని బడ్జెట్ లోపల అప్పులే ఏకంగా రూ.1,28,702 కోట్లకు చేరాయి. బడ్జెట్ లోపల, బయట చేసిన, చేయనున్న అప్పులు రూ.1,91,112 కోట్లకు పెరిగాయి.
» బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.31,410 కోట్లు అప్పు చేస్తోంది. ఏపీ జల్‌జీవన్ వాటర్ సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తప్ప మిగతా బడ్జెట్ బయట అప్పును ఇప్పటికే ప్రభుత్వం చేసేసింది.
» రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కోల నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కూడా కాకుండానే రూ.2 లక్షల కోట్ల అప్పుల మార్క్‌ను చేరడం ఖాయం. కాగా, ఈ స్థాయిలో బాబు సర్కారు అప్పులు తెస్తున్నప్పటికీ ఎల్లో మీడియా మౌనంగా ఉంటోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసినా ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించింది. అదే చంద్రబాబు ఇప్పుడు మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.
ఆస్తులు సమకూర్చలేదు.. అప్పులు పెంచారు
బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టాను సారం అప్పులు చేస్తున్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా బాబు సర్కారు కాలక్షేపం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులతో ఆస్తులు కూడా సమకూర్చలేదు. వివిధ వర్గాలకు సూపర్ సిక్స్‌తో పాటు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు.

