
అన్నీ ‘టెక్నికల్’ బదిలీలే
సీటు కదలకుండా అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు
రెగ్యులర్ బదిలీల్లో అడుగడుగునా అక్రమాలు చేసినా కీలక బాధ్యతలు
డైరెక్టరేట్‌ను వదలని ఏడీలు.. మంత్రికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
కాంట్రాక్టు లెక్చరర్లకు మాత్రం 750 కి.మీ దూరంలో పోస్టింగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మే నెలలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెప్పింది. తొలుత పలుకుబడి, డబ్బులిచ్చిన వారికి అనువుగా బదిలీ మార్గదర్శకాలు రూపొందించగా, వాటిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో కార్యదర్శి స్థాయిలో చర్యలు తసుకున్నారు. దీంతో మార్గదర్శకాలు మార్చిన ఆ శాఖ అధికారులు.. అధికారికంగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చి వాటిని పట్టించుకోకుండా ఎక్కడి వారు అక్కడే అదే సీట్లలో తిష్టవేసి కొనసాగడం విస్తుగొలుపుతుంది.
ముఖ్యంగా డైరెక్టరేట్‌లోని అధికారులు అయితే కాగితాలపై బదిలీ చేయించుకుని, అదే పోస్టులో కొనసాగుతూ ఇక్కడికి బదిలీ అయిన వారిని రాకుండా అడ్డుకుంటున్నారని సమాచారం. పైగా డైరెక్టరేట్‌లోనే కొనసాగేందుకు డెప్యుటేషన్‌కు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోస్టులు సర్దుకుని, దానికి వెబ్ కౌన్సెలింగ్ అని పేరు పెట్టినా.. జీవోలు ఇచ్చాక వాటిని పట్టించుకోవద్దని చెప్పినా వారికే చెల్లిందని శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా విమర్శిస్తున్నారు.
చినబాబుకు చుట్టం అని చెప్పుకుంటూ..!
2016 నుంచి డైరెక్టరేట్‌లో పాతుకుపోయిన ఓ ఏడీ స్థాయి అధికారి చేస్తున్న అక్రమాలపై పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) ఏకంగా విద్యాశాఖ మంత్రికే లేఖ రాసినా ఆ అధికారిపై చర్యలు లేవు. పైగా ఆయన్ను అదే పోస్టులో కొనసాగించారు. ఇటీవల బదిలీల్లో ఆయన్ను మరో చోటుకు మార్చినా డైరెక్టరేట్‌లోనే ఉండి చినబాబు చుట్టంగా చెప్పుకుంటూ అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ స్వకార్యాలు చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇచ్చుకున్న వారికి నచ్చిన చోటుకు..
పట్టణాల్లోని(ఫోకల్) కాలేజీల్లో పనిచేసినవారికి తిరిగి అదే స్థాయి ప్రాంతానికి బదిలీలు ఉండవని ఉత్తర్వుల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవేమీ తమకు వర్తించదన్నట్టుగా కొందరికి ఫోకల్ నుంచి ఫోకల్‌కే పోస్టింగ్ వేయడం గమనార్హం. ఇలా కాకినాడ నుంచి ఒకరికి కౌన్సెలింగ్‌లో నాన్–ఫొకల్ అని చెప్పి జీవోలో మాత్రం గుంటూరుకు వేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చెప్పారని మరొకరిని విశాఖపట్నం నుంచి రాజమండ్రికి పోస్టింగ్ ఇచ్చారు. విజయవాడ కాలేజీలో పనిచేస్తున్న ఒకరిని ఆత్మకూరు బదిలీ చేస్తున్నట్టు చెప్పి జీవోలో మాత్రం రాజమండ్రికి ఇచ్చారు.
టెక్నికల్ బోర్డులో అంతా వారిష్టారాజ్యం
సాంకేతిక విద్యాశాఖలో కొందరు అధికారులు ఆడిందే ఆటగా సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. డైరెక్టరేట్‌లో నాన్–టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా 2016 నుంచి పనిచేస్తున్న ముగ్గురు అధికారులకు ఇటీవల జంగారెడ్డిగూడెం, ఎటపాక, శ్రీశైలం కాలేజీలకు బదిలీ అయ్యింది. అయితే, ఎటపాకకు బదిలీ అయిన ఏడీ డైరెక్టరేట్‌లోనే కొనసాగుతున్నారు. పైగా బదిలీ ఉత్తర్వులు పట్టించుకోవద్దని సదరు కాలేజీకి సమాచారం ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగుతోంది.
శ్రీశైలం బదిలీ అయిన ఏడీ కూడా డైరెక్టరేట్‌లోనే కొనసాగుతున్నారు. పైగా డైరెక్టరేట్‌లోని 3 ఏడీ పోస్టుల్లో రెండు పోస్టులు మాత్రమే కౌన్సెలింగ్‌లో చూపి, ఒక పోస్టును పక్కనపెట్టారని, ఈ పోస్టులోకి ఓ అధికారి వచ్చేందుకు ఆసక్తి చూపగా, ఆయన్నుంచి బలవంతంగా ఆసక్తి లేదని లెటర్ తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. బోర్డులో రెండు టెక్నికల్ ఏడీ పోస్టులు ఖాళీ ఉంటే ఒకరు బదిలీపై వచ్చారు, కానీ ఆయనకు ఇప్పటి దాకా బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది.
డైరెక్టరేట్‌ను వదల్లేని అధికారులు తాజాగా డెప్యుటేషన్ల కోసం సిద్ధమైనట్టు సమాచారం. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ఏసీబీ, సీఐడీ కేసుల్లో ఉన్నవారు డైరెక్టరేట్‌లో కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై విద్యాశాఖ మంత్రికి పాలా లేఖరాసినా ఆయన పట్టించుకోలేదు. దీంతో మంత్రి చెప్పిన ఆంధ్రామోడల్ ఎడ్యుకేషన్ ఇదేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు నరకం
బదిలీల్లో అనేక తప్పులు చేసిన అధికారులు కాంట్రాక్టు లెక్చరర్లకు మాత్రం నరకం చూపిస్తున్నారు. జోన్లు, రీజియన్లు మార్చేశారు. 400 కిలోమీటర్ల నుంచి 750 కిలోమీటర్ల దూరానికీ బదిలీ చేసి అక్కకడ పనిచేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. కుటుంబ అవసరాల రీత్యా కనికరించాలని వేడుకున్నా.. కరుణించడం లేదు. ఉద్యోగం వదిలి పోండని ఛీత్కరిస్తున్నారు.
బదిలీలు చేసినా బేఖాతరు
సాంకేతిక విద్యలో బదిలీలకు ప్రభుత్వం జూన్ 16న ఉత్తర్వులిచ్చింది. జీవో నం.91 ద్వారా ప్రిన్సిపల్స్/ డిప్యూటీ డైరెక్టర్ల స్థాయి అధికారులు 13 మందిని బదిలీ చేయగా నలుగురు అధికారులు డైరెక్టరేట్‌లోనే కొనసాగుతున్నారు. జీవో నం.92 ద్వారా సెక్షన్ హెడ్ కేడర్ అధికారులను 92 మందిని బదిలీ చేసింది. ఇందులోనూ ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నవారు బదిలీ అయినా సరే కొత్త పోస్టులోకి వెళ్లకుండా డైరెక్టరేట్‌లోనే చక్రం తిప్పుతున్నారు. డైరెక్టరేట్‌కు వచ్చిన వారికి విధులు అప్పగించకుండా వేధించడంతోపాటు ఏ పోస్టులో వచ్చారో ఆ విధులు కానివి ఇచ్చి పక్కనపెట్టారు.
» కడప జిల్లా జమ్మలమడుగు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్‌ను డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) పోస్టులో డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు. కానీ ఈయనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ)లో జాయింట్ కార్యదర్శిగా విధులు అప్పగించారు. వాస్తవానికి డిప్యూటీ డైరెక్టర్ అనేది రెగ్యులర్ పోస్టు కాగా, ఎస్బీటీఈటీలో అసలు జాయింట్ సెక్రటరీ పోస్టే లేదు. పైగా ఆత్మకూరు ప్రిన్సిపల్‌ను డెప్యుటేషన్‌పై తెచ్చి ఓఎస్డీ బాధ్యతలతో పాటు కీలకమైన డీడీ–టెక్ పోస్టులో కూర్చోబెట్టారు.
» పలమనేరు పాలిటెక్నికల్ ప్రిన్సిపల్‌ను డెప్యూటీ డైరెక్టర్‌గా డైరెక్టరేట్‌కి బదిలీ చేశారు, కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.
» సాంకేతిక విద్య డైరెక్టరేట్‌లో డెప్యూటీ డైరెక్టర్ (అకడమిక్)గా 2018 నుంచి పనిచేస్తున్న అధికారిని జమ్మలమడుగు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేశారు. కానీ ఇప్పటికీ ఆయన డైరెక్టరేట్‌లో డెప్యూటీ డైరెక్టర్ (అకడమిక్)గానే కొనసాగుతుండడం గమనార్హం.
» డైరెక్టరేట్‌లో 2018 నుంచి డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్)గా పనిచేస్తున్న అధికారిని బదిలీల్లో భాగంగా హిందూపురం ప్రిన్సిపల్‌గా వేశారు, కానీ ఈ అధికారి మాత్రం ఓఎస్డీగా సచివాలంయలో కొనసాగుతున్నారు.
సెక్షన్ హెడ్స్ ఇంకా ప్రత్యేకం..
జూన్‌లో పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న 92 మంది సెక్షన్ హెడ్ కేడర్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై వచ్చి డైరెక్టరేట్‌లో కొనసాగుతున్నవారూ ఉన్నారు. తాజా బదిలీల్లో వీరికీ స్థానచలనం కలిగినా అదే సీట్లను అంటిపెట్టుకుని ఉన్నారు.
» శ్రీశైలం పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ విభాగం హెడ్‌ని గుంతకల్‌కు బదిలీ చేశారు. ఈయన 2018 నుంచి డైరెక్టరేట్‌లోనే (ఏడాది మినహా) డెప్యుటేషన్‌పై డిప్యూటీ కార్యదర్శి హోదాలోనే కొనసాగుతున్నారు. గుంతకల్‌కు బదిలీ చేసినా ఆయన సీటు మాత్రం వదల్లేదు.
» 2017 నుంచి డైరెక్టరేట్‌లో ఏడీగా ఉన్న ఓ అధికారి బదిలీలు జరుగుతాయని తెలియగానే విజయవాడ పాలిటెక్నిక్ సెక్షన్ హెడ్‌గా బదిలీ చేయించుకున్నారు. కానీ, డైరెక్టరేట్‌లో కొనసాగారు. ఇటీవలి బదిలీల్లో ఆయన్ను జంగారెడ్డిగూడెం కాలేజీకి పంపినా ఆయన డైరెక్టరేట్‌లోనే కొనసాగుతున్నారు.
» 2023లో రాయదుర్గం సెక్షన్ హెడ్‌గా బదిలీ చేయించుకున్న ఓ అధికారి అక్కడ బాధ్యతలు తీసుకున్న వెంటనే డెప్యుటేషన్‌పైగా డైరెక్టరేట్‌కు వచ్చారు, ఆయనకు ఇప్పుడు అధికారికంగా రాయదుర్గం నుంచి మైదుకూరుకి బదిలీ అయినా ఇక్కడే కొనసాగుతున్నారు.